
చిన్న వయసులోనే కోట్లు సంపాదించి, అప్పుల ఊబి నుంచి బయటపడి, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని నేటి యువత కలలు కంటోంది. అయితే దీనికి కేవలం భారీ జీతం మాత్రమే ఉంటే సరిపోదు. కచ్చితమైన ఆర్థిక క్రమశిక్షణ, తెలివైన పెట్టుబడులు, ఆదాయ మార్గాలను పెంచుకోవడం ఎంతో అవసరం. తాజాగా బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల ఒక టెక్ ప్రొఫెషనల్ తన ఆర్థిక ప్రయాణాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకోగా.. అది ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. 26 ఏళ్ల వయసులో రూ.1 కోటి నికర విలువతో మొదలై, 29 ఏళ్లకు రూ.5 కోట్లు, ప్రస్తుతం 31 ఏళ్లకు ఏకంగా రూ.7 కోట్ల సంపదను సమకూర్చుకున్న అతని ప్రయాణం అనేక కీలక ఆర్థిక పాఠాలను నేర్పుతోంది.
ఈ టెకీ సంపద ప్రయాణం ఏమీ విలాసవంతమైన భారీ ప్యాకేజీతో మొదలుకాలేదు. కాలేజీ పూర్తయిన వెంటనే చిన్న మొత్తాలతోనే మ్యూచువల్ ఫండ్లలో సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. కాంపౌండింగ్ పవర్‌ను చిన్నతనంలోనే అర్థం చేసుకుని, ఆర్థిక స్వాతంత్ర్యంపై స్పష్టమైన లక్ష్యంతో క్రమంగా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. ఫలితంగా 26 ఏళ్లకే తొలి కోటి రూపాయల మార్కును అందుకున్నాడు.
చాలామంది సంపద సృష్టించాలంటే ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలని భావిస్తారు. కానీ ‘‘పొదుపు చేయడానికి ఒక పరిమితి ఉంటుంది. అదే ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎలాంటి హద్దులు ఉండవు’’ అన్నది ఈ టెకీ ప్రాథమిక సూత్రం. కోడింగ్ లేదా సాంకేతికతలో తాను అత్యుత్తమ నిపుణుడిని కాకపోయినప్పటికీ.. నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఉద్యోగ మార్పులు, వేగవంతమైన పదోన్నతులు, ఉత్పత్తుల తయారీ ద్వారా తన సంపాదన సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూ పోయాడు.
ఉద్యోగంతో పాటు సాస్, డి2సి వ్యాపారాలపై ఆయన అనేక ప్రయోగాలు చేశాడు. ఆఫీస్ పని ముగిసిన తర్వాత రాత్రి వేళల్లో మూడు నెలల పాటు కష్టపడి ఒక ప్రత్యేక AI యాప్‌ను అభివృద్ధి చేశాడు. కానీ మార్కెటింగ్ లోపాల వల్ల ఆ యాప్ దారుణంగా విఫలమై, మార్కెటింగ్ కోసం పెట్టిన కొన్ని లక్షల రూపాయలు చేజారిపోయాయి. అయినా నిరాశ చెందకుండా ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
ఆయన జీవనశైలిలో అత్యంత ఆశ్చర్యపరిచే విషయం.. ఆర్భాటాలకు దూరంగా ఉండటం. ఇప్పటివరకు 15 సార్ల కంటే ఎక్కువగా విదేశాలకు వెకేషన్లకు వెళ్లినప్పటికీ, ఆయన వద్ద ఇప్పటికీ ఒక్క కొత్త కారు కూడా లేదు. తన తండ్రి వాడిన 15 ఏళ్ల నాటి పాత కారునే ఇప్పటికీ వాడుతున్నాడు. ప్రదర్శన కోసం కాకుండా తనకు నిజంగా సంతోషాన్నిచ్చే అనుభవాలపైనే డబ్బు ఖర్చు చేయడమనేది ఆయన అభిప్రాయం. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం వల్ల ఇతరులతో పోల్చుకునే మనస్తత్వం పోయి, అనవసరమైన స్టేటస్ ఖర్చులు భారీగా తగ్గాయని తెలిపాడు.
ఆయన సంపద కేవలం ఒకే రంగంలో లేదు. తాను పనిచేసే టెక్ కంపెనీలో దాదాపు రూ.2 కోట్ల విలువైన ఈసాప్స్ ఉన్నప్పటికీ.. మార్కెట్ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని నికర విలువలో రూ.1.5 కోట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాడు. మరో రూ.40 లక్షలను హై రిస్క్ అన్‌లిస్టెడ్ కంపెనీలో పెట్టాడు. ఇక గత ఏడాది సాధించిన అతిపెద్ద విజయం.. రెండు ఆస్తులపై ఉన్న బ్యాంకు లోన్స్ పూర్తిగా చెల్లించి రుణ రహిత వ్యక్తిగా మారడం. రెండేళ్ల క్రితం రూ.65 లక్షలకు కొన్న ఫ్లాట్ విలువ నేడు రూ.1 కోటికి చేరడమే కాకుండా వార్షికంగా 5% అద్దె ఆదాయాన్ని కూడా అందిస్తోంది. స్టాక్ మార్కెట్ నిలకడగా ఉన్న సమయంలో రుణాలను వదిలించుకోవడమే సరైన నిర్ణయమని ఆయన సూచిస్తున్నాడు.