ఉన్నత విద్య అందులోనూ విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదువుకోవాలని పిల్లలు.. వారిని అలా పెద్ద స్థాయిలో చదివించాలని తల్లిదండ్రులూ ఆశపడతారు. అయితే, ఆశపడ్డ అందరికీ ఆయా యూనివర్సిటీల్లో సీటు రాదు. కష్టపడి సీటు తెచ్చుకున్నా.. దానికి అవసరమైన డబ్బు సమకూర్చుకోలేక మన దేశంలోనే ఎదో ఒకటి పూర్తి చేసేవారు కోకొల్లలుగా ఉంటారు. కేవలం డబ్బు లేని కారణంగా చాలామందికి అవకాశం ఉన్నా.. విదేశాల్లో ఉన్నత విద్య అందని ద్రాక్షగానే ఉండిపోతోంది. అయితే, విదేశీ విద్య అనేది కొన్నాళ్ల క్రితం వరకూ మాత్రమే డబ్బున్న వారికి ఒక్కరికే అందుబాటులో ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్ద చదువులు చదవడానికి పిల్లలు సిద్ధం అయితే అందుకు తగ్గ తెలివితేటలూ.. శ్రద్దా.. ఆసక్తి ఉంటే డబ్బు లేకపోయినా లోన్ తీసుకుని తమ కల నెరవేచుకునే అవకాశం ఉంది.
లోన్‌కు అర్హత పొందాలంటే, మీరు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే భారతదేశంలోనే నివసిస్తున్నవారు అయి ఉండాలి. మంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఉండాలి. దానికి సంబంధించిన రుజువులు ఉండాలి. మన దేశంలో అన్ని బ్యాంకులూ విదేశీ విద్య కోసం లోన్స్ ఇస్తున్నాయి. అయితే, మొత్తం ఖర్చు లో 80 నుంచి 90 శాతం మాత్రమే బ్యాంకులు లోన్ గా ఇస్తాయి. లోన్ విద్యార్ధి పేరు మీదే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు రీ పేమెంట్ చేసినా సరే లోన్ మాత్రం విద్యార్ధి పేరుపైనే రిలీజ్ అవుతుంది.
ఇక మీరు చేయాలనుకునే కోర్స్ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఒక నిర్దిష్ట కోర్స్ చేయాలి అనుకున్నపుడు అది మీ అభిరుచికి తగ్గట్టుగా ఉందని నిర్ధారించుకోండి. ఎవరో చెప్పారనీ.. ఫలానా కోర్స్ చేస్తే మంచి ఉద్యోగం వచ్చేస్తుంది అనీ.. అమ్మానాన్నా బలవంతం పెట్టారని సబ్జెక్ట్ ఎంచుకోవద్దు. చాలామంది ఇలా తమకు ఇష్టం లేకపోయినా ఎదో కోర్సు లో జాయిన్ అయిపోయి.. చదవలేక.. ఒకవేళ చదివినా.. దానిని ఒంట పట్టించుకోలేక అటూ ఇటూ కాకుండా మిగిలిపోతున్నారు. లోన్ తీసుకుని మీ పై అది తీర్చే బాధ్యత కూడా ఉంటుంది. అందువల్ల మీరు ఎంచుకునే సబ్జెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య ఎంచుకునేటప్పుడు కోర్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతే జాగ్రత్తగా దేశం.. యూనివర్సిటీలను ఎంచుకోవడంలో ఉండాలి. మీరు ఎంచుకునే దేశంలో ఖర్చులనూ లెక్కవేసుకోవాలి. చాలా యూరోపియన్ దేశాలు ట్యూషన్ ఫ్రీ ఇస్తాయి.
అయితే.. ఇతర దేశాలతో పోల్చినపుడు ఇక్కడ కొంత మేర అద్దె.. ట్రాన్స్‌పోర్ట్.. హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై ఎక్కువ ఖర్చు కావచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది. మీరు ఎంచుకునే యూనివర్సిటీ క్యాంపస్ జాయినింగ్స్ అంటే ఉద్యోగాలకు ఎంత మేర గ్యారంటీ ఇస్తారు అనేదానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీ చదువు పూర్తి అయిపోయిన తరువాత ఎంత త్వరగా జాబు వస్తే అంత మంచిది. అది మీ లోన్ త్వరగా తీర్చడంలో సహాయపడుతుంది.
అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైనా పూచీకత్తు లేకుండా రూ. 4 లక్షల వరకు లోన్ పొందవచ్చు 4 – 7.5 లక్షల మధ్య లోన్ కోసం మీరు తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి వంటి కో- అప్లికెంట్ ను కలిగి ఉండాలి. చాలా బ్యాంకులు కో-అప్లికెంట్ స్థిరమైన నెలవారీ ఆదాయంతో ఆర్థికంగా స్థిరంగా ఉండాలని కోరుతాయి. ఇలాంటి వారికీ కొన్ని ప్రయివేట్ బ్యాంకులు 40 లక్షల వరకూ కూడా లోన్ ఇస్తాయి. ఇక రూ.7.5 లక్షల కంటే ఎక్కువ లోన్ కోసం ప్రతి బ్యాంక్‌కి దాని స్వంత నియమాలు, వడ్డీ రేట్లు ఉంటాయి. మీరు వారి నియమాల ప్రకారం హామీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లోన్ తీసుకునే ముందు మీరు వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే వ్యవధి, ఆలస్య చెల్లింపు రుసుములు, ప్రతి బ్యాంకు అందించే మారటోరియం వ్యవధిని అలాగే మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని వివరంగా స్టడీ చేయండి. సాధారణంగా, వడ్డీ రేట్లు 9 – 15 శాతం మధ్య ఉంటాయి. ఇది కాంపౌండ్ ఇంటరెస్ట్ కాబట్టి, మీ రీపేమెంట్ మొత్తాలు పెరగవచ్చు. బ్యాంకులు స్వల్పకాలిక – దీర్ఘకాలిక రీపేమెంట్ పథకాలను అందిస్తాయి. అధిక రుణ మొత్తాలు ఎక్కువ కాలం తిరిగి చెల్లించడానికి అనుమతిస్థాయి.
భారత ప్రభుత్వం విద్యా రుణాల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్ (CGFSEL)ని ప్రారంభించింది. దీని కింద విద్యార్థులు సహ-దరఖాస్తుదారులు లేకుండా రూ.7.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఒక సంవత్సరం మారటోరియంతో 5 నుంచి 7 సంవత్సరాల వరకు రుణాలను తిరిగి చెల్లించవచ్చు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మోడల్ స్కీమ్ కింద, విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి రూ.20 లక్షల వరకు విద్యా రుణం పొందవచ్చు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు బాలికల కోసం ప్రభుత్వ పథకాలను అందిస్తాయి. ఇక్కడ వడ్డీ రేట్లు తరచుగా సాధారణం కంటే తక్కువగా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద 8 సంవత్సరాల పాటు విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై (అసలు మొత్తం కాదు) పన్ను మినహాయింపు కూడా అందిస్తారు.
విద్యా రుణాల విషయానికి వస్తే, విద్యార్థులు ఉత్తమమైన వాటి కోసం ఆశించాలి. కానీ చెత్త పరిస్థితుల కోసం కూడా సిద్ధంగా ఉండాలి. మీరు సమయానికి ఉద్యోగం సంపాదించలేకపోతే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా బ్యాంకులు మారటోరియం వ్యవధిని పొడిగిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి