Nirmala Seetharaman: ఈనెల 20న పీఎస్‌బీ అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం.. బ్యాంక్‌ల పనితీరుపై సమీక్షించనున్న సీతారామన్..

|

Jun 18, 2022 | 7:24 AM

ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం సమావేశం అవ్వనున్నారు. ఇందులో బ్యాంకుల పనితీరును సమీక్షించడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల విషయంలో అవి సాధించిన పురోగతిపై చర్చలు జరపనున్నారు...

Nirmala Seetharaman: ఈనెల 20న పీఎస్‌బీ అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం.. బ్యాంక్‌ల పనితీరుపై సమీక్షించనున్న సీతారామన్..
Nirmala Sitharaman
Follow us on

ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం సమావేశం అవ్వనున్నారు. ఇందులో బ్యాంకుల పనితీరును సమీక్షించడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల విషయంలో అవి సాధించిన పురోగతిపై చర్చలు జరపనున్నారు. 2022-23కు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత బ్యాంకులతో జరుగుతున్న మొట్టమొదటి సమీక్ష సమావేశం ఇదే కావడం విశేషం. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి పయనించేలా చేసే నిమిత్తం ఉత్పాదకత రంగాలకు రుణాలను మంజూరు చేయాల్సిందిగా బ్యాంకులను ఆర్థిక మంత్రి కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు ద్వారా తెలిసింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం సహా వివిధ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రభావం చూపుతోంది. బ్యాంకుల రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యత, వ్యాపార వృద్ధి ప్రణాళికల గురించి నిర్మాల సీతారామన్‌ తెలుసుకోనున్నారు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, అత్యవసర రుణ హామీ పథకం లాంటి పథకాల పురోగతిపైనా విస్తృత సమీక్షను మంత్రి నిర్వహించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈసీఎల్‌జీఎస్‌ పథకాన్ని 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ పథకం కింద రుణ హామీ పరిమితిని రూ.50,000 నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచారు కూడా. మరోవైపు 2020-21లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.31,820 కోట్లుగా ఉంది. అంతకుముందు అయిదేళ్లుగా పీఎస్‌బీలు మొత్తంగా నష్టాన్ని నమోదు చేస్తున్నాయి. 2017-18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నికర నష్టం రాగా.. 2018-19లో రూ.66,636 కోట్లు, 2019-20లో రూ.25,941 కోట్లు; 2015-16లో రూ.17,993 కోట్లు; 2016-17లో రూ.11389 కోట్ల నష్టాన్ని పీఎస్‌బీలు నమోదు చేశాయి.