ఇండియాకు వచ్చేసిన ఫ్లిప్‌కార్ట్ హెడ్‌ ఆఫీస్‌! IPOకి లైన్‌ క్లియర్‌..

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన IPOకు మార్గం సుగమం చేస్తూ, సింగపూర్ నుండి హోల్డింగ్ నిర్మాణాన్ని భారత్‌కు మార్చింది. భారత ప్రభుత్వం ఆమోదంతో, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు భారతదేశంలో నమోదు చేయబడిన సంస్థ. ఇది భారత స్టాక్ ఎక్స్ఛేంజీలలో ప్రత్యక్ష లిస్టింగ్‌కు కీలకమైన అడుగు.

ఇండియాకు వచ్చేసిన ఫ్లిప్‌కార్ట్ హెడ్‌ ఆఫీస్‌! IPOకి లైన్‌ క్లియర్‌..
Flipkart Ipo

Updated on: Mar 10, 2026 | 5:35 PM

ఇండియాలోని అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌ చాలా కాలంగా ఎదురుచూస్తున్న IPO దిశగా కీలకమైన అడుగు వేసింది. కంపెనీ హోల్డింగ్ నిర్మాణాన్ని సింగపూర్‌ నుండి తిరిగి ఇండియాకు మార్చే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కంపెనీకి ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ మద్దతు ఇస్తోంది. కంపెనీ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. అంతర్గత పునర్‌వ్యవస్థీకరణకు భారత ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్నెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌కు ప్రధాన హోల్డింగ్ సంస్థగా మారింది. ఈ రెడమిసైల్ ప్రక్రియ పూర్తవడంతో ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా భారతదేశంలో నమోదు చేయబడిన సంస్థగా మారింది. విదేశాల్లో నమోదు అయిన కంపెనీలు భారత స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ అవ్వలేని కారణంగా, ఈ మార్పు IPOకు కీలకమైన దశగా భావిస్తున్నారు.

వివిధ నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే పబ్లిక్ లిస్టింగ్ కోసం ప్రముఖ పెట్టుబడి బ్యాంకులతో చర్చలు ప్రారంభించింది. వీటిలో గోల్డ్‌మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, JP మోర్గాన్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి సంస్థలు ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో IPO వచ్చే అవకాశముందని అంచనా. ఫ్లిప్‌కార్ట్ 2007లో సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్సల్‌లు బెంగళూరులో స్థాపించారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌కు 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అలాగే 16 లక్షలకు పైగా విక్రేతలు తమ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు. కంపెనీ లాజిస్టిక్స్ విభాగం ఈకార్ట్‌ లాజిస్టిక్స్‌ దేశవ్యాప్తంగా సుమారు 22,000 పిన్‌కోడ్‌లకు డెలివరీ సేవలు అందిస్తోంది.

2018లో వాల్‌మార్ట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి కంపెనీ నియంత్రణను స్వాధీనం చేసుకుంది. అది భారత రిటైల్ రంగంలో జరిగిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ తన రిజిస్టర్డ్ కార్యాలయాన్ని తిరిగి భారత్‌కు మార్చడం, దేశంలోని మూలధన మార్కెట్లు వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో భారతీయ స్టార్టప్‌లు తమ హోల్డింగ్ నిర్మాణాలను తిరిగి భారత్‌కు తీసుకువచ్చే కొత్త ధోరణికి ఉదాహరణగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us