
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం ఒక కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ పేరుతో వస్తున్నఈ ప్లాన్.. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్, ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ వీఐపీ, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లాయల్టీ ప్రోగ్రామ్‌ల కంటే మరింత ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా యాడ్స్ లేకుండా వీడియోలు చూడొచ్చు. యూట్యూబ్ ప్రీమియం వార్షిక ప్లాన్ ధర సుమారుగా రూ. 1490గా ఉంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌లో ఒక పెద్ద ఆకర్షణ.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ సాధారణ ధర సంవత్సరానికి రూ. 1499. కానీ పరిమిత కాలం ఆఫర్ కింద దీన్ని రూ. 990కి పొందవచ్చు. దీంతో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ వీఐపీ మెంబర్‌షిప్ ధర ఏడాదికి రూ. 799. అంటే, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ కోసం దాదాపు రెట్టింపు ఖర్చు చేయాలి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ అనేది ఆర్డర్ల సంఖ్య ఆధారంగా లభిస్తుంది. ఒక సంవత్సరంలో 10 ఆర్డర్లు చేస్తే ప్లస్ సిల్వర్ మెంబర్‌షిప్, 20 కంటే ఎక్కువ ఆర్డర్లు చేస్తే ప్లస్ గోల్డ్ మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతుంది.
మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లించిన తర్వాత, దాన్ని రద్దు చేయడానికి లేదా డబ్బును తిరిగి పొందడానికి అవకాశం లేదు. ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ తమ ప్రీమియం కస్టమర్ బేస్‌ను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..