Farmers Good News: దేశంలో ఎరువుల కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులకు ఊరట లభించింది.16 లక్షల టన్నుల యూరియా దిగుమతికి కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎరువుల కొరతతో సతమతమవుతున్న రైతుల కష్టాలు తీరనున్నాయి.10 లక్షల టన్నుల ఎరువులు పశ్చిమ తీరంలోని ఓడరేవుకు వస్తాయని, తూర్పు తీరానికి 6 లక్షల టన్నులు వస్తాయని ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. దిగుమతి చేసుకున్న ఎరువులు దేశానికి చేరుకున్న తర్వాత, దేశీయ మార్కెట్‌లో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) సరఫరా చేస్తుంది.
80 నుంచి 90 లక్షల టన్నుల యూరియా దిగుమతి
భారతదేశం ప్రతి సంవత్సరం 24 నుంచి 25 మిలియన్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది. అయితే దేశీయ డిమాండ్ ఉత్పత్తిని మించిపోయింది ఇందుకోసం ప్రతి సంవత్సరం 80 నుంచి 90 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకోవాలి. యూరియా అవసరాలు, డిమాండ్, సరఫరా, ధరలను బేరీజు వేసుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు యూరియా దిగుమతిని అనుమతిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్-జూలై త్రైమాసికంలో చైనా నుంచి సుమారు పది లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకోనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
ఇప్పుడు దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చైనా ఎగుమతులను నిషేధించింది. భారతదేశం ఇప్పుడు ప్రధానంగా రష్యా, ఈజిప్ట్ నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటోంది. దేశంలోని మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా వాటా 55 శాతం. యూరియాయేతర (ఎంఓపీ, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు) రకాల ధర ఎక్కువగా ఉండడంతో రైతులు యూరియాను ఎక్కువ పరిమాణంలో వాడేందుకు ఇష్టపడుతున్నారు. 45 కిలోల యూరియా బస్తా గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పి) రూ. 242, 50 కిలోల బస్తా రూ. 268 కాగా, 50 కిలోల డిఏపీ బస్తా రూ.1,200.