
ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకుంటున్నారా? అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారా? ఇక ఆలోచించకండి. వెంటనే షోరూమ్‌కు వెళ్లి మీకు నచ్చిన వాహనం తీసుకోండి. లేకపోతే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనం పొందే అవకాశం తొందరలో ముగిసిపోనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పథకం (ఎఫ్‌ఏఎంఈ)లో మీకు రాయితీలు వర్తిస్తాయి. ఇవి రానున్న కాలంలో ఉండకపోవచ్చు. 2024 మార్చి 31లోపు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ పథకం రెండో దశలో రాయితీలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. లేదా నిధులు ఉన్నంత వరకూ అమల్లో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అది వర్తిస్తుంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ కోసం రూ.7,048 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మీరు వేగంగా నిర్ణయం తీసుకోకపోతే మంచి ప్రయోజనాలను కోల్పోతారు. మార్చి 31 తర్వాత ఈ ప్రభుత్వం అందించే ఫేమ్-2 సబ్సిడీ ముగిసిపోతుండటంతో పర్యావసానంగా ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు పెరుగుతాయి. అది వినియోగదారులకు అదనపు భారం అవుతుంది. మీరు కనుక ఈ-వాహనం కొనుగోలు చేయాలంటే ఈ లోపే కొనుగోలు చేయడం ఉత్తమం.
ఎలక్ట్రిక్ బైక్‌లకు ఇటీవల ఆదరణ పెరిగింది. చాలామంది వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్నపెట్రోలు ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా ఎక్కువైంది.. అలాగే కాలుష్యం నివారణకు దోహదపడుతుంది. ఇంటిలోనే చార్జింగ్ చేసుకునే వీలు ఉండడంతో మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాల వాడకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. సబ్సిడీలు అందిస్తూ కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే ప్రముఖ కంపెనీలైన ఏథర్, ఒకాయా, ఓలా వంటి కంపెనీలు ఈ నెలఖరు వరకూ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఈనెల ఆఖరి వరకూ మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది మార్చి 31వ తేదీకి లోపు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసినా, రిజిస్టర్ చేసుకున్నా రూ.22,485 వరకూ సబ్సిడీ లభిస్తుందని, ఆ తర్వాత అంతమేర ప్రయోజనం ఉండకపోవచ్చని ఏథర్ ఎనర్జీ ప్రకటించింది.
ఒకాయా సంస్థ తమ వాహనాలపై సుమారు రూ.18 వేలు వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెలాఖరు వరకూ మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సాధారణంగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు సుమారు రూ.74,899 నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే సుమారు 75 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తాయి. వీరి కంపెనీకి చెందిన ఫాస్ట్ ఎఫ్4 మోడల్‌బండి ఒక్కసారి చార్జింగ్ చేస్తే 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తుంది. రూ. 1,37,990 ఖరీదైన ఈ బండిని ఇప్పుడు 1,19,990కే ఇస్తున్నారు. రెండు బ్యాక్టరీలతో 444 కేడబ్ల్యూహెచ్‌తో అత్యుత్తమ సామర్థ్యం కలిగి ఉంది.
ఓలా కంపెనీ కూడా తన ఎస్1 రేంజ్‌బళ్లపై రూ.25 వేల వరకూ తగ్గింపు ఇస్తోంది. 1,09,000 విలువైన ఓలా ఎస్‌వన్ ఎక్స్ ప్లస్ మోడల్ బండిని రూ 84,999కు అందుబాటులోకి తెచ్చింది. ఓలా ఎస్‌వన్ ఎయిర్ ధర కూడా 1,19,000 నుంచి 105000కు తగ్గింది. అలాగే ఓలా ఎస్‌వన్ ప్రో 1,48,000 నుంచి 1,30,000కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..