
బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడానికి ప్రధాన ప్రోత్సాహకాలను ప్రకటించింది. ముఖ్యంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ 2.0ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలో ఆమోదం పొందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం మార్చి 31తో గడువు ముగిసిన మునుపటి వెర్షన్‌ను భర్తీ చేస్తుంది. ఈ స్కీమ్‌ను తాత్కాలికంగా 15 రోజులు పొడిగించారు. పలు నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల షిఫ్ట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం తన ప్రతిపాదిత ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ 2.0 కింద మహిళలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుపై రూ. 36,000 వరకు సబ్సిడీని అందించవచ్చని అంచనా వేస్తున్నార. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న మొదటి 10,000 మంది మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. మార్చి 31, 2030 వరకు చెల్లుబాటులో ఉండే ఈ పథకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే కాకుండా త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలకు కూడా వర్తిస్తుంది.
ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త పాలసీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కేడబ్ల్యూహెచ్‌కి రూ. 10,000 (రూ. 30,000 వరకు) కొనుగోలు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అర్హత ఉన్న అందరూ మహిళలు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ ద్విచక్ర వాహనాన్ని స్క్రాప్ చేస్తుంటే మీకు అదనంగా రూ. 10,000 అందిస్తారు. పాలసీ వ్యవధిలో 10 సంవత్సరాలు నిండిన అన్ని సీఎన్‌జీ ఆటోలను తప్పనిసరిగా ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయాలి. ఇలా చేశాక ఆ వాహనానికి లక్ష రూపాయల వన్-టైమ్ రీప్లేస్‌మెంట్ ప్రోత్సాహకం ఇస్తారు. అయితే ఈ ప్రయోజనం పొందిన వారు పాలసీ కింద మరే ఇతర ప్రోత్సాహకాలకు అర్హత ఉండదు. సీఎన్‌జీ ఆటోలను భర్తీ చేసే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు (ఎల్5ఎం వర్గం) బ్యాటరీ పరిమాణాన్ని బట్టి పాలసీ రూ. 45,000 వరకు సబ్సిడీని ఇస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఐసీఈ (పెట్రోల్/డీజిల్) ఆటోను రద్దు చేస్తుంటే మీకు రూ. 20,000 ప్రోత్సాహకం అందిస్తారు.
ఎలక్ట్రిక్ వాహనాల వాణిజ్య వినియోగాన్ని కూడా ఈవీ పాలసీ ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ గూడ్స్ క్యారియర్‌ను కొనుగోలు చేస్తే మీరు రూ.45,000 వరకు సబ్సిడీ పొందవచ్చు. ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ గూడ్స్ క్యారియర్‌కు సబ్సిడీ రూ.75,000 వరకు ఉండవచ్చు. ఈ ప్రయోజనాలు మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటాయి. వ్యక్తులు, వ్యాపారాలు ఇద్దరూ వీటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. సబ్సిడీ పొందడానికి వాహన ధర ఎల్5ఎన్ కి రూ. 4.5 లక్షల లోపు, ఎన్1 వాహనాలకు రూ. 12.5 లక్షల లోపు ఉండాలి. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం ప్రకారం పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ద్విచక్ర వాహనాలు ఆగస్టు 15, 2026 నుంచి రోడ్లపై నిషేధిస్తారు. గూడ్స్ క్యారియర్‌ల కోసం డీజిల్, పెట్రోల్ లేదా సీఎన్‌జీ త్రీ వీలర్ల కొత్త రిజిస్ట్రేషన్లు ఆగస్టు 15, 2025తో ముగుస్తాయి. ఇప్పటికే ఉన్న సీఎన్‌జీ ఆటో పర్మిట్లు అదే తేదీ నుంచి పునరుద్ధరించరు. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే పర్మిట్లు జారీ చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..