ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ సేవలు ఇప్పుడు భారతదేశంలో మరింత ప్రియం అయ్యాయి. ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలను పెంచినట్లు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లో ఎక్స్ ప్రీమియం ధరలు పెరగగా. తాజాగా భారత్ దేశంలోనూ పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రీమియం ప్లస్ ప్లాన్ తీసుకున్నవారు తప్ప మిగిలినవారంతా కొత్త ధరల ప్రకారమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక నుంచి ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్‌స్క్రెబర్లు ప్రస్తుతం ఉన్న ధర కంటే 35 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో మార్కెట్లో దీని ధర ఏకంగా 40 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకు ఎక్స్ ప్రీమియం ధర నెలకు రూ.1,300 ఉండగా.. ఇకపై రూ.1,750 చెల్లించాలి. అంటే ఏడాది మొత్తానికి రూ.18,300 ఎక్స్ ప్రీమియం ప్లస్ వారు చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌తో పాటు కెనడా, నైజీరియాలో కూడా ఇంతే పెంచారు. అన్నిచోట్ల ఒకేలా కాకుండా ప్రాంతాలు, పన్నుల బట్టి ధరలు మారుతాయి.
ఈ ధరలు పెంచేందుకు అనేక కారణాలున్నాయని ఎలాన్ మస్క్ అంటున్నారు. ఈ కొత్త ప్లాన్ ప్రకారం యూజర్లకు యాడ్ ఫ్రీ కంటెంట్ చూసే అవకాశం లభిస్తుంది. అలాగే కంటెంట్ క్రియేటర్లు మరింత డబ్బు సంపాదించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రకటనలు ఎన్నిసార్లు చూశారు అనేదే కాకుండా ఏ కంటెంట్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే దాన్ని పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఇంకా ఎన్నో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నట్లు మస్క్ ప్రకటించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..