
ప్రస్తుతం ఏదీ కొనాలన్న ఆన్‌లైన్‌లోనే. బట్టల నుంచి ప్రతి చిన్న వస్తువు వరకు ఇంట్లోనే బుక్ చేయడం కామన్‌గా మారింది. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఇప్పటికే ఎన్నో ఈ కామర్స్ సైట్లు పుట్టుకొచ్చాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా వంటి యాప్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. గత కొంత కాలంగా బట్టలకు సంబంధించి మింత్రా దూసుకపోతుంది. బట్టలు అనగానే నెటిజన్స్ ఎక్కువగా ఈ యాప్‌నే యూజ్ చేస్తున్నారు. దీంతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో మింత్రాపై ఈడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మింత్రా ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. రూ.1,654.35 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించినందుకు మింత్రాతో పాటు దాని అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్‌డీఐ నిబంధనలను ఉల్లంఘించి.. మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు ఈడీ చెబుతోంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా బెంగళూరు జోనల్ కార్యాలయంలో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.
హోల్‌సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామనే కారణంతో మింత్రా రూ.1654.35 కోట్ల విలువైన ఎఫ్‌డీఐని అందుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అయితే ఎక్కువ ఉత్పత్తులను వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మింత్రా విక్రయించింది. ఆ తర్వాత వెక్టర్ కస్టమర్లకు అమ్మింది. ఇక్కడ వెక్టర్ కూడా మింత్రా అనుబంధ సంస్థ కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం.. హోల్‌సేల్ మోడల్ కింద పనిచేసే కంపెనీలు తమ వస్తువులలో 25శాతం వరకు మాత్రమే తమ అనుబంధ సంస్థలకు విక్రయించొచ్చు. మింత్రా మాత్రం తన అమ్మకాలలో 100శాతం వెక్టర్ ఇ-కామర్స్‌కు అమ్మేసింది. ఒకే గ్రూప్‌కు చెందిన సంస్థకు 100శాతం విక్రయాలు జరపి.. మింత్రా ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందని ఈడీ ఆరోపించింది.
నిజానికి హోల్‌సేల్ వ్యాపారం చేసే సంస్థలు నేరుగా కస్టమర్లకు ఉత్పత్తులను అందించకూడదు. రిటైలర్లకు లేదా ఇతర వ్యాపార సంస్థలకు హోల్‌సేల్‌గా అమ్మాలి. అయితే మింత్రా మాత్రం తన అనుబంధ సంస్థ ద్వారా నేరుగా కస్టమర్లకు ఉత్పత్తులను అమ్మింది. ఇది ఫెమా ఉల్లంఘనల కిందకు వస్తుందని.. అందుకే కేసు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసుపై మాత్రం మింత్రా ఇంకా స్పందించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..