
దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రోకరేజ్ సంస్థ రాత్రికి రాత్రే దుకాణ సర్దేయడంతో పెట్టుబడిదారులు రోడ్డుపై పడ్డారు. దుబాయ్ బిజినెస్ బేలోని ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు క్యాపిటల్ గోల్డెన్ టవర్. ఈ టవర్‌లోని సూట్ 302 ఖాళీగా దర్శనమిస్తుంది. కొన్ని వారాల క్రితం ఈ సూట్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్లకు నిలయంగా ఉండేది. పెట్టుబడిదారులను నిండా ముంచుతూ ఇప్పుడూ ఆ సంస్థ మూసేసి నిర్వాహకులు పారిపోయారని పలు న్యూస్ ఐటమ్స్ ద్వారా కనిపిస్తుంది. గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని సూట్లు 302, 305 లలో దాదాపు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించే వారు. పెట్టుబడిదారులను కోల్డ్-కాలింగ్ చేయడంతో ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ఉద్యోగులు పని చేశారు. దుబాయ్‌లో మూతపడిని ఈ సంస్థలో కొందరు భారతీయులు కూడా పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తుంది.
మొహమ్మద్, ఫయాజ్ పోయల్ కేరళకు చెందిన ప్రవాసులు వీరు గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్ల పెట్టుబడి పెట్టారు. అయితే కొన్ని రోజులుగా సంస్థ గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో వారు సంస్థ ఆఫీస్‌కు వెళ్లి చూసి షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ సంస్థలోని ఉద్యోగులు పెట్టుబడిదారులకు ఫోన్ చేసి తక్కువ ప్రారంభ పెట్టుబడితో పెద్ద స్థాయిలో లాభాలు వస్తాయని పేర్కొని పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. మొదట్లో భారీ స్థాయిలో లాభాలు రావడంతో పెట్టుబడికి ముందుకు వచ్చారు. అలాగే మొదట్లో పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేందుకు పెట్టుబడులపై వచ్చిన లాభాలు కూడా ఉపసంహరించుకునే అవకాశాన్నికూడా కల్పించింది. అయితే క్రమేపి పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు వీలు లేకుండా చేసి ప్రమాదకర ట్రేడ్స్‌లో పెట్టుబడి పెట్టేలా చేశారని వాపోతున్నారు.
సిగ్మా-వన్ క్యాపిటల్ ద్వారా పెట్టుబడి పెట్టమని గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ క్లయింట్లను ప్రోత్సహిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ బ్రోకరేజ్ సంస్థ ద్వారా జీవితకాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారు పెద్ద సంఖ్యలో నష్టపోయారని చెబుతున్నారు. ఈ కంపెనీలో దాదాపు 50,000 డాలర్లు కోల్పోయిన మొహమ్మద్ అనే మరో పెట్టుబడిదారుడు మాట్లాడుతూ గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను పరస్పరం మార్చుకుని, ఒకే కంపెనీలాగా ఉపయోగించారని చెప్పాడు. ఈ ఘటపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సిగ్మా-వన్ క్యాపిటల్కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్‌సీఏ అధికారం లేదని నిర్ధారించారు. మొత్తం మీద ఈ దుబాయ్ కంపెనీ చాలా దేశాల్లోని పెట్టుబడిదారులు నిండా ముంచినట్లు తెలుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..