PMBJK: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. స్టేషన్లలోనూ జన్ ఔషధి షాపులు.. తక్కువ ధరకే మందులు..

|

May 10, 2024 | 5:37 PM

దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో కొత్తగా వంద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను (పీఎంబీజేకేలు) ఏర్పాటు చేయనుంది. రూ. 12.53 లక్షల వ్యక్తిగత వ్యయంతో ప్రీ-ఫ్యాబ్రికేషన్ నిర్మాణాలతో ఈ కేంద్రాలు ఉంటాయి. రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

PMBJK: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. స్టేషన్లలోనూ జన్ ఔషధి షాపులు.. తక్కువ ధరకే మందులు..
Jan Aushadi Kendras3
Follow us on

భారతీయ రైల్వే తన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. స్టేషన్ల ఆధునీకరణ, మెరుగైన నిర్వహణ, టిక్కెట్ రిజర్వేషన్లలో సౌలభ్యం తదితర వాటిని కల్పించింది. అలాగే సాధారణ, ప్లాట్ ఫాం టికెట్లను కూడా ఆన్ లైన్ లో పొందే అవకాశం ఇచ్చింది. వీటితో పాటు ప్రయాణికులకు అత్యవసర సమయంలో ఉపయోగపడేలా ప్రధానమంత్రి భారతీయ జనౌషధీ కేంద్రాలను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రయాణికులు తమకు అవసరమైన మందులను (మెడిసిన్) తక్కువ ధరకు పొందే అవకాశం ఉంటుంది.

కొత్తగా వంద కేంద్రాలు..

దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో కొత్తగా వంద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను (పీఎంబీజేకేలు) ఏర్పాటు చేయనుంది. రూ. 12.53 లక్షల వ్యక్తిగత వ్యయంతో ప్రీ-ఫ్యాబ్రికేషన్ నిర్మాణాలతో ఈ కేంద్రాలు ఉంటాయి. రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. లైసెన్సులు తదితర అన్ని అర్హతలు కలిగిన వారితో రైల్వే స్టేషన్లలోని సర్క్యులేటింగ్ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు.

ప్రయాణికుల సంక్షేమం..

రైల్వే స్టేషన్లను సందర్శించే ప్రయాణికుల క్షేమం, సంక్షేమాన్నిపెంపొందించే ప్రయత్నంలో భాగంగా భారతీయ రైల్వే ఆగస్టు 2023లో పీఎంబీజేకేలను స్థాపించడానికి ఒక పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. దానిపై కొంత కసరత్తు చేసి దేశంలోని సుమారు 50 రైల్వే స్టేషన్ల జాబితా రూపంలో తయారు చేసింది. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ఏడాది మార్చిలో ఆయా స్టేషన్లలో పీఎంబీజేకేలు ప్రారంభమయ్యాయి.

అందుబాటు ధరలో మందులు..

దేశంలోని రైళ్లలోని నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వారితో రైల్వే స్టేషన్లన్ని కిటకిటలాడుతుంటాయి. వారి అవసరాలు తీర్చడంతో పాటు నాణ్యమైన మందులను అందుబాటు ధరలో అందించడమే పీఎంబీజేకేల ప్రధాన లక్ష్యం. అలాగే షాపుల నిర్వహణ వల్ల పలువురికి ఉపాధి దొరుకుతుంది. ప్రయాణికుల సంక్షేమం, షాపుల నిర్వహణతో ఉపాధి.. రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

అత్యంత కీలకం..

ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసే పీఎంబీజేకేలు ప్రయాణికులకు అవసరమయ్యే అత్యంత కీలక సౌకర్యాలుగా మారతాయి. ఈ కేంద్రాలు ప్రయాణికులకు అనుకూలమైన ప్రదేశాలలో ఉంటాయి. దానివల్ల ఇన్‌కమింగ్, అవుట్‌ గోయింగ్ ప్రయాణికులందరికీ ప్రయోజనం చేకూరుతుంది.

ఈ-వేలంతో కేటాయింపు..

ఆయా రైల్వే డివిజన్లలో ఇ-వేలం ద్వారా ఈ స్టాళ్లు కేటాయిస్తారు. వీటి నిర్వహించే వారికి అవసరమైన అనుమతులు, లైసెన్స్‌లు తప్పనిసరిగా ఉండాలి. మందుల నిల్వలకు చట్టబద్ధంగా అన్ని వసతులు ఉండాలి. అవుట్‌లెట్ల బిడ్డర్లు తమ కార్యకలాపాలను ప్రారంభించే ముందు పీఎంబీజేకే నోడల్ ఏజెన్సీ, ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ), జనౌషధి పథకం కోసం దాని అధీకృత పంపిణీదారులతో ఒప్పందం కుదుర్చుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..