Oppo India: వెలుగులోకి మరో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఆర్థిక అవకతవకలు.. వేల కోట్లు ఎగ్గొట్టిన ఒప్పో

Oppo India Tax Evasion: ఒప్పో ఇండియా ఏకంగా రూ.4,389 కోట్ల దిగుమతి సుంకాలను ఎగ్గొట్టినట్లు డీఆర్ఐ పరిశీలనలో తేలింది.

Oppo India: వెలుగులోకి మరో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఆర్థిక అవకతవకలు.. వేల కోట్లు ఎగ్గొట్టిన ఒప్పో
Oppo India
Image Credit source: TV9 Telugu

Updated on: Jul 13, 2022 | 6:01 PM

భారత్‌లోని చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ అనుబంధ సంస్థల ఆర్థిక అవకతవకలు ఒక్కోటిగా వెలుగుచూస్తున్నాయి. ఇది వరకే వివో ఇండియా ఆర్థిక అక్రమాలు వెలుగుచూడగా.. తాజాగా ఒప్పో ఇండియా(Oppo India) భారత్‌లో కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవలకు పాల్పడినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) గుర్తించింది. ఆ కంపెనీ ఏకంగా రూ.4,389 కోట్ల దిగుమతి సుంకాలను ఎగ్గొట్టినట్లు డీఆర్ఐ పరిశీలనలో తేలింది. ఇటీవల ఒప్పో ఇండియా కార్యాలయాలు, ఆ సంస్థకు చెందిన ఉన్నతోద్యోగుల నివాసాల్లో జరిపిన సోదాల్లో ఒప్పో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని పేర్కొంది.

కొన్ని వస్తువుల దిగుమతులపై కేంద్రం కల్పిస్తున్న ప్రత్యేక మినహాయింపు ప్రయోజనాలను దుర్వినియోగం చేయడం ద్వారా ఒప్పో ఇండియా భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. దీని ద్వారా ఏకంగా రూ.2,981 కోట్ల విలువ చేసే దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టింది. వీటిని దిగుమతి చేసుకునే సమయంలో ఒప్పో ఇండియా ప్రతినిధులు, అధికారులు వాటికి సంబంధించి కస్టమ్స్ అధికారులకు అవాస్తవ సమాచారాన్ని ఇచ్చినట్లు డీఆర్ఐ ఆరోపించింది. దీంతో పాటు ఇతర వక్ర మార్గాల్లోనూ ఒప్పో ఇండియా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

దేశ వ్యాప్తంగా ఒప్పో, వన్‌ప్లస్‌, రియల్‌మీ పేరిట స్మార్ట్ ఫోన్లను ఒప్పో ఇండియా విక్రయిస్తోంది. పన్ను ఎగువేత నిరోధక చట్టాల కింద ఒప్పో ఇండియా, ఆ కంపెనీ ఉన్నత ఉద్యోగులు చట్టబద్ధంగా కోర్టుల ద్వారా శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..