
అంతర్జాతీయం, దేశీయంగా బంగారం ధరలు చరిత్ర సృష్టిస్తున్నాయి. సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ఎవరూ ఊహించనంత స్ధాయికి చేరుకుంటున్నాయి. రానన్న రోజుల్లో మరింతగా పెరగనున్నాయనే అంచనాలతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు కూడా పెరిగిపోతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు మరింతగా పెరుగుతుండగా.. అంతర్జాతీయ పరిస్థితులు, ట్రంప్ సుంకాలు, దేశాల మధ్య యుద్దాలు, యూఎస్ డాలర్ బలహీన పడటం కూడా గోల్డ్ రేట్లపై ప్రభావితం చూపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెంత రికార్డులు నమోదు చేస్తాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
1979 తర్వాత బంగారం ధరలు రికార్డు స్థాయిలో జంప్ అవ్వడం ఇదే తొలిసారిగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2025లో ఇప్పటివరకు స్పాట్ గోల్డ్ దాదాపు 71 శాతం పెరగ్గా.. ఇండియన్ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్(MCX)లో 80 శాతం వరకు పెరిగింది. 2024 క్రిస్మస్ నుంచి బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. గత డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.76,748 వద్ద ఉంది. ఇప్పుడు అది 50 శాతం కంటే ఎక్కువ పెరిగింది. గత 12 నెలల్లో బలమైన అప్‌ట్రెండ్‌ను సూచించాయి. సెప్టెంబర్‌లో అత్యధికంగా బంగారంపై 13 శాతం నెలవారీగా లాభం నమోదవ్వగా.. డిసెంబర్‌లో 9 శాతంగా ఉంది
ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా ఆల్ టైం గరిష్ట స్ధాయికి చేరుకుంది. ఈ నెల 18 నుంచి వెండి ధర ఏకంగా రూ.29 వేలు పెరిగింది. వచ్చే ఏడాదిలో ప్రకటించిన వడ్డీ రేట్లలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కోత పెడుతుందనే వార్తలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కేంద్ర బ్యాంకులు భారీగా గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయి. అన్ని దేశాలు తమ విదేశీ మారక నిల్వలను డాలర్ నుంచి బంగారంలోకి మారుస్తున్నాయి. ఇది బంగారం పెరగడానికి అదనపు బలాన్ని చేకూరుస్తోంది.