డెలవరీ కార్మికుల సమ్మె.. న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా? వారి సమస్యలేంటంటే?

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డెలివరీ కార్మికుల సమ్మె ఆన్‌లైన్‌ ఫుడ్‌, గ్రాసరీ సేవలను ప్రభావితం చేయనుంది. వేతన పారదర్శకత, 10 నిమిషాల డెలివరీ ప్రమాదాలు, కార్మికుల ఐడీ బ్లాకింగ్‌పై నిరసనగా టీజీపీడబ్ల్యూయూ, ఐఎఫ్ఏటీ వంటి యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.

డెలవరీ కార్మికుల సమ్మె.. న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా? వారి సమస్యలేంటంటే?
Delivery Worker Strike

Updated on: Dec 31, 2025 | 1:14 PM

డెలివరీ కార్మికుల సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ డెలవరీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వేతన పారదర్శకత, వర్కర్ ఐడీలను బ్లాక్ చేయడం, 10 నిమిషాల డెలివరీల వినియోగం పెరగడం, ఈ మోడల్‌పై నిషేధం వంటి వాటిపై డెలివరీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 25న జరిగిన సమ్మె తర్వాత మరోసారి ఆయా సంఘాలు సమ్మె సైరన్‌ మోగించాయి.

ఈ రెండు సమ్మెలకు తెలంగాణకు చెందిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), కర్ణాటకకు చెందిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ (IFAT) వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చాయి. ఢిల్లీకి చెందిన గిగ్ వర్కర్స్ అసోసియేషన్ (GiGWA) మద్దతును పొందాయి. క్రిస్మస్ సందర్భంగా దాదాపు 50,000 మంది కార్మికులు పాల్గొన్నారని, బుధవారం జరిగే సమ్మెలో దాదాపు 1.5 లక్షల మంది చేరే అవకాశం ఉందని టిజిపిడబ్ల్యుయు అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024-25లో దేశంలో గిగ్ కార్మికుల సంఖ్య 1 కోటి దాటిందని అంచనా. అయితే డెలవరీ కార్మికుల డిమాండ్లపై జెప్టో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఉబర్ ప్రతినిధులు స్పందించలేదు.

అయితే డెలివరీ కార్మికులు 10 నిమిషాల డెలివరీలలో ఉండే ప్రమాదం, పారదర్శకత లేని వేతన నిర్మాణం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మేము డెలివరీకి ఒక సెకను ఆలస్యమైనా, రోజంతా మా బెనిఫిట్స​్‌ నిలిపివేస్తారు. మేము రోజుకు కనీసం 13-15 గంటలు పని చేస్తాం. గత కొన్ని నెలలుగా కనీస పని గంటలు 10 నుండి 13 కి పెరిగాయి అని కార్మికులు తెలిపారు. ప్రస్తుతం కార్మికులకు పని గంటలు కాకుండా వారు పూర్తి చేసిన పనుల ఆధారంగా జీతం లభిస్తుంది. కానీ ఈ వ్యవస్థ వేచి ఉండే సమయం, తక్కువ డిమాండ్, చెడు వాతావరణం, ట్రాఫిక్ జాప్యాలను పరిగణనలోకి తీసుకోదు. ప్లాట్‌ఫామ్‌లు తమకు నచ్చినప్పుడల్లా వేతన నిర్మాణాలను మార్చుకుంటాయి, కాబట్టి కార్మికులకు వారి సంపాదన ఎలా ఉంటుందో తెలియదు అని GiGWA ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి