Personal Loans: పర్సనల్ లోన్స్.. ఎవరికి ట్రాప్.. ఎవరికి బెనిఫిట్..? ఈ అపోహలు వీడండి..

ప్రస్తుత రోజుల్లో పర్సనల్ లోన్ ఈజీగానే లభిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వంటివి మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి వడ్డీ రేటులో రాయితీలు సైతం ప్రకటిస్తున్నాయి. దీంతో కొందరు అవసరం ఉన్నా లేకున్నా పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు. మరికొందరేమో వీటి గురించిన పూర్తి విషయాలు తెలియక అత్యవసర సమయాల్లో కూడా పర్సనల్ లోన్లు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. పర్సనల్ లోన్స్ గురించి బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ 5 అపోహల గురించి తెలుసుకోండి..

Personal Loans: పర్సనల్ లోన్స్.. ఎవరికి ట్రాప్.. ఎవరికి బెనిఫిట్..? ఈ అపోహలు వీడండి..
Personal Loan Myths

Updated on: Feb 18, 2025 | 4:13 PM

డిజిటలైజేషన్లో భాగంగా ఈ రోజుల్లో పర్సనల్ లోన్స్ పొందడం గతంతో పోలిస్తే ఎంతో సులువైంది. ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో డబ్బుల కోసం చూస్తున్నారో వారికి ఈ లోన్ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటి చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి.

అప్పు తీసుకోవడానికి ఎవరు అర్హులు..

పర్సనల్ లోన్స్ విషయంలో అన్నింటికంటే పెద్ద అపోహ ఏమిటంటే.. ఈ రుణాలు కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అందిస్తారని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పెళ్లి, ఇంటి నిర్మాణం, ఇంటికి అవసరమైన పరికరాల కొనుగోలు, సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ కొనుగోలు, వ్యాపారం ప్రారంభించడం.. ఇలా ఎన్నో రకాల ఖర్చుల కోసం ఈ లోన్ సదుపాయం ఉంది. మీరు తీసుకునే సొమ్ము చట్టబద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించినంత వరకూ ఏ బ్యాంకూ మిమ్మల్ని దేనికి ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని అడగదు.

క్రెడిట్ స్కోరు మాటేమిటి.. ?

పర్సనల్ లోన్స్ పొందేవారికి 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు కలిగి ఉండాలి. ఇది అనేక ప్రయోజనాలకు కలిగిస్తుంది. వీరికి తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపులు, మినహాయింపులు, రుణ మొత్తం కాలపరిమిత వంటి విషయాల్లో వీరికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అనేక ఆర్థిక సంస్థలు 750 కంటే తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలను ఇస్తాయి. ఇందుకోసం దరఖాస్తుదారునికి స్థిరమైన ఆదాయ వనరు, స్థిరమైన కెరీర్, గతంలో ఎటువంటి రుణం లేదా క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు లేకపోవడం, తక్కువ రుణం-ఆదాయ నిష్పత్తి, సహ దరఖాస్తుదారు లేదా హామీదారు లభ్యత మొదలైనవి ఉన్నాయా అనే విషయాలు చూస్తారు.

జీతం పొందే వారు మాత్రమే అర్హులా..

నెల నెలా స్థిరమైన శాలరీ తీసుకునే వారికి మనీ ఫ్లో బాగుంటుంది. ఇది రుణాలు ఇచ్చే సమయంలో వారు కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేందుకు సాయపడుతుంది. అంతేకానీ కేవలం జీతాలు తీసుకునే వారికి మాత్రమే ఈ రుణాలు ఇస్తారని లేదు. స్వయం ఉపాధి పొందేవారు, టెక్నీషియన్లు, కన్సల్టెంట్లు, బిజినెస్ చేసేవారు వీరందరూ పర్సనల్ లోన్స్ తీసుకునేందుకు అర్హులే.

క్రెడిట్ కార్డులకన్నా బెటరే..

పర్సనల్ లోన్స్ అనేవి అన్ సెక్యూర్డ్ రుణాల జాబితాలోకి వస్తాయి. ఎందుకంటే వీటికి ఎలాంటి పూచీకత్తు లేదు కనుక. అందువల్ల ఇల్లు, వాహనాల వంటివి సెక్యూరిటీగా తీసుకునే వాటికంటే ఈ లోన్లపై వడ్డీ కాస్త ఎక్కువే. అయితే, ఏడాదికి 36 నుంచి 45 శాతం వరకు వసూలు చేసే క్రెడిట్ కార్డుల లోన్స్ కంటే ఈ పర్సనల్ లోన్స్ చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. అగ్రగేటర్ వెబ్ సైట్ ద్వారా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉందో పోల్చుకుని లోన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆల్రెడీ లోన్ తీసుకుంటే మళ్లీ ఇస్తారా..

ఇప్పటికే లోన్ పొందినవారు మరోసారి అర్హులు కాదని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీకు రుణం తీసుకుని కట్టగలిగే ఆర్థిక స్థోమత ఉంటే ఆల్రెడీ లోన్ తీసుకున్న వారు కూడా ఇంకోదానికి అప్లై చేసుకోవచ్చు. అయితే, మీ బ్యాంకు మీ రుణ, ఆదాయం (డీటీఐ) నిష్పత్తిని ఇక్కడ అంచనా వేస్తుంది. అయితే, అవసరం మేరకు మాత్రమే లోన్స్ తీసుకోవాలి. లేదంటే రుణాల ట్రాప్ లో చిక్కుకుని ఇబ్బందిపడతారు.