
స్విట్జర్లాండ్‌లోని దావోస్ అనేది ప్రపంచ రాజకీయ, ఆర్థిక చర్చలకు చిరునామాగా మారిన చిన్న పర్వత పట్టణం. ప్రపంచ నేతలు, అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు ఇక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనాలని కోరుకుంటారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వాలు, విస్తరణ అవకాశాల కోసం కార్పొరేట్ సంస్థలు ఈ వేదికను వినియోగించుకుంటాయి. అందుకే దావోస్ పేరు గ్లోబల్ పవర్ సెంటర్‌గా నిలిచింది. ఈ ఏడాది సదస్సు నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికిపైగా ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సహా అనేక దేశాధినేతలు, ప్రభుత్వ పెద్దలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి కూడా పలువురు ముఖ్యమంత్రులు ఈ సదస్సుకు వెళ్తున్నారు. ఈ సదస్సుకు సుమారు 400 మంది రాజకీయ నాయకులు హాజరవుతుండగా, అందులో 64 మంది దేశాధినేతలు ఉన్నారు. దాదాపు 1,000 మంది సీఈవోలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు పౌరసమాజ ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, నిపుణులు కూడా ఈ చర్చల్లో భాగమవుతున్నారు.
దావోస్ ఆల్ప్స్ పర్వతాల మధ్య ఉన్న అతి శీతల ప్రాంతం. 19వ శతాబ్దంలో ఐరోపాలో టీబీ వ్యాధి వ్యాపించిన సమయంలో స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చేవారు. అలా ఏర్పడిన నివాస ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించారు. అదే చర్చి నేడు ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రధాన వేదికగా మారింది. ఈ చర్చి ప్రాంగణంలోనే అమెరికా అధ్యక్షుడు, ఆయన క్యాబినెట్ సభ్యులు, వ్యాపారవేత్తలు, ఇతర దేశాల నేతలు కీలక ఆర్థిక చర్చల్లో పాల్గొంటారు. ఒకప్పుడు ఆరోగ్య పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ఈ స్కీయింగ్ రిసార్టు పట్టణం, నేడు ప్రపంచ ఆర్థిక విధానాలపై నిర్ణయాలు తీసుకునే కేంద్రంగా మారింది.
1970లో ఈ చర్చిని కూల్చి అపార్ట్‌మెంట్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అది వారసత్వ సంపదగా నిలిచిపోయింది. ఇదే ప్రాంతంలో షెర్లాక్ హోమ్స్ రచయిత ఆర్థర్ కోనన్ డోయిల్ కూడా కొంతకాలం నివసించారు. తన భార్య ఆరోగ్యం కోసమే ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. వేసవిలో ఆరోగ్య పర్యాటక కేంద్రంగా, శీతాకాలంలో క్రీడల హబ్‌గా దావోస్ మారుతుంది. అయితే గత ఐదు దశాబ్దాలుగా ఈ పట్టణానికి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సే ప్రత్యేక గుర్తింపునిచ్చింది. 1971 నుంచి ప్రతి జనవరిలో ఈ సదస్సు జరుగుతోంది. మొదట ఇది యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరమ్‌గా నిర్వహించబడింది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ స్వాబ్ ఈ సదస్సును ప్రారంభించారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఏడాది దావోస్‌లో 56వ సదస్సు జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశాలను కవర్ చేయడానికి 500 మంది జర్నలిస్టులు దావోస్‌కు చేరుకుంటున్నారు. ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రముఖుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్క్, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, చైనా ఉప ప్రధాని హీ లీఫెంగ్, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గయ్ పర్మెలిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాలస్తీనా ప్రధాని మహమ్మద్ ముస్తఫా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉన్నారు. వీరితో పాటు అనేక దేశాల అధ్యక్షులు, ప్రధానులు కూడా హాజరవుతున్నారు. ఈ సదస్సుకు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, నాటో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎన్డీపీ, ఓఈసీడీ వంటి అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా వస్తున్నారు. దీంతో ఈ సమావేశాలకు గ్లోబల్ పాలసీ స్థాయిలో మరింత ప్రాధాన్యం లభిస్తోంది.
దావోస్ వేదికగా గతంలో అనేక కీలక ఒప్పందాలు కుదిరాయి. 1988లో గ్రీస్ – టర్కీ మధ్య దావోస్ డిక్లరేషన్, 1989లో ఉత్తర – దక్షిణ కొరియాల తొలి మంత్రిస్థాయి భేటీ, 1994లో ఇజ్రాయెల్–పాలస్తీనా గాజా – జెరికో ఒప్పందం వంటి చారిత్రక ఘట్టాలు ఇక్కడే చోటు చేసుకున్నాయి. జర్మనీ పునరేకీకరణపై చర్చలు కూడా ఇదే వేదికపై జరిగాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఒక్కసారి మాత్రమే దావోస్ వెలుపల జరిగింది. 2001లో అమెరికాలో జరిగిన ఉగ్రదాడుల అనంతరం, 2002లో బాధితులకు సంఘీభావంగా న్యూయార్క్‌లో నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా 2021లో సదస్సు వర్చువల్‌గా జరిగి, 2022లో మే నెలకు వాయిదా పడింది.
దావోస్‌లో వసతి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్నాయి. దావోస్‌తో పాటు సమీపంలోని క్లోస్టర్స్, డార్ఫ్ ప్రాంతాల్లో కూడా కొద్ది హోటళ్లే ఉన్నాయి. అందుకే ఈ ఐదు రోజులపాటు మొత్తం ప్రాంతం జనసంద్రంగా మారుతుంది. సదస్సుకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది సాయుధ బలగాలు, స్నైపర్లు, ఏఐ ఆధారిత డ్రోన్లు, చొరబాట్లను గుర్తించే పరికరాలతో దావోస్‌ను కట్టుదిట్టంగా కాపాడుతున్నారు. భద్రత కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తోంది. భారత్ నుంచి కూడా భారీ ప్రతినిధుల బృందం దావోస్‌కు వెళ్తోంది. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే 100 మందికిపైగా అగ్రశ్రేణి సీఈవోలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. భారత వ్యాపార రంగానికి చెందిన అగ్ర దిగ్గజాలు గ్లోబల్ పెట్టుబడులపై చర్చల్లో పాల్గొననున్నారు.