
ఏథర్ 450ఎక్స్ జెన్2 ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేసిన ఖాతాదారుడు, దానిపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన తండ్రి ఆ స్కూటర్ పై ఎంత అభిమానం పెంచుకున్నారో వివరించాడు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో నివసించే పంకజ్ మాల్వియా 2022లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశాడు. అప్పుడే ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి నెమ్మదిగా విడుదలతూ ఉన్నాయి. అథర్ కంపెనీ కూడా కేవలం ప్రధాన నగరాల్లోనే విక్రయాలు ప్రారంభించింది. దీంతో పంకజ్ ఢిల్లీలో ఏథర్ స్కూటర్ ను కొనుగోలు చేసి, భోపాల్ లో ఉంటున్న తన తండ్రికి పంపించాడు. అయితే పంకజ్ తండ్రికి ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి అస్సలు తెలియదు. ఆయన ఎప్పుడు వాటిని నడవపలేదు. కొన్ని రోజుల పాటు ఏథర్ స్కూటర్ ను పంకజ్ తండ్రి ముట్టుకోలేదు. ఆయన అప్పటికే మరో కంపెనీకి చెందిన స్కూటర్ (పెట్రోలు వాహనం) వినియోగిస్తున్నారు. పంకజ్ రూ.1.7 లక్షలు ఖర్చుపెట్టి ఏథర్ స్కూటర్ ను కొనుగోలు చేయడం ఆయనకు నచ్చలేదు. పైగా అది అనవసర ఖర్చు అని వ్యాఖ్యానించేవాడు.
ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగాలను పంకజ్ తన తండ్రికి వివరిస్తూ ఉండేవాడు. దీంతో కాలానికి ఆయన ఆ స్కూటర్ ను నడపడం ప్రారంభించాడు. అనంతరం ఎప్పుడు దాన్ని వదలలేదు. ఏథర్ స్కూటర్ పనితీరు ఆయనకు ఎంతో నచ్చింది. ఇక తన పాత స్కూటర్ ను వదిలేశాడు. ఏథర్ స్కూటర్ తో పంకజ్ తండ్రి ప్రయాణం దాదాపు మూడేళ్లుగా సాగుతోంది. ఆయన ఇప్పటికి సుమారు 34,200 కిలోమీటర్లకు పైగా నడిపాడు. గతంలో తన పాత స్కూటర్ లో రోజుకు రూ.వంద పెట్రోలు నింపుకొనేవారు. ఇప్పుడు ఏథర్ 450 ఎక్స్ ను చక్కగా చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకుంటున్నాడు.
పంకజ్ తండ్రికి ప్రారంభంలో ఏథర్ స్కూటర్ ట్రాకింగ్, ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు ఇబ్బందిగా అనిపించాయి. క్రమంగా వాటిని వినియోగించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ స్కూటర్ ఫీచర్లపై పూర్తిగా అవగాహన వచ్చేసింది. ఆయన స్కూటర్ పై బయటకు వెళ్లినప్పుడు పంకజ్ ట్రాక్ చేస్తూ గమనిస్తాడు. మొత్తానికి పంకజ్ తండ్రి ఏథర్ స్కూటర్ కు అభిమానిగా మారిపోయాడు. ఏథర్ 450 ఎక్స్ బ్యాటరీ ఇంకా బలంగానే ఉందని, మరో రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పంకజ్ తెలిపాడు. ఒక వేళ బ్యాటరీ పాడైపోతే తన తండ్రి కోసం ఏథర్ రిజ్టాను తీసుకుంటానని వెల్లడించాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి