Crude Oil: తగ్గిన క్రూడ్‌ ఆయిల్ ధర.. 5 శాతానికి పైగా పతనం.. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..

క్రూడ్ ఆయిల్(Crude Oil) ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ ధర తగ్గడం వరుసగా మూడో రోజు. వాస్తవానికి రష్యా, ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య చర్చలు జరుగుతున్నాయి...

Crude Oil: తగ్గిన క్రూడ్‌ ఆయిల్ ధర.. 5 శాతానికి పైగా పతనం.. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..
Crude oil

Updated on: Mar 30, 2022 | 7:00 AM

క్రూడ్ ఆయిల్(Crude Oil) ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ ధర తగ్గడం వరుసగా మూడో రోజు. వాస్తవానికి రష్యా, ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో విభేదాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా రాబోయే కాలంలో కాల్పుల విరమణపై ఇరుపక్షాలు అంగీకరించే అవకాశం ఉంది. ఈ సంకేతాల కారణంగానే ముడి చమురు ధరల్లో పతనం కనిపిస్తోంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బ్రెంట్(Brent) క్రూడ్ 105 డాలర్ల స్థాయి దిగువకు పడిపోయింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 105 నుంచి 110 డాలర్ల మధ్య ట్రేడవుతోంది.

మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధరలు 5 శాతానికి పైగా పతనమయ్యాయి. మార్చి 23న బ్యారెల్ ధర 121.6 డాలర్ల స్థాయికి చేరుకుంది. గత నెల రోజులుగా బ్రెంట్ క్రూడ్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. మార్చి 8న బ్యారెల్‌కు 127.98 డాలర్ల స్థాయికి చేరిన తర్వాత ధరలు తగ్గుముఖం పట్టగా మార్చి 16న బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 100 డాలర్లకు తగ్గింది. ఆ తర్వాత ధరలు మరోసారి పెరగడం కొనసాగింది. మార్చి 23 న, ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు పైగా పెరిగింది. మార్చి 25 తర్వాత వరుసగా మూడో రోజు ధరలు తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ముడిచమురు ధరలపై పెను ప్రభావం చూపుతోంది. శాంతి చర్చలతో ముడిచమురులో మెత్తదనం వచ్చింది. మరోవైపు, చైనాలో మరోసారి కోవిడ్ లాక్‌డౌన్ విధించడం సెంటిమెంట్‌లను మరింత దిగజార్చింది మరియు ముడి చమురు డిమాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. షాంఘైలో కరోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్ విధించారు. చైనా మొత్తం చమురు డిమాండ్‌లో 4 శాతం షాంఘై నుంచి వస్తోంది. దీంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. అయితే, ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో ఎటువంటి పెరుగుదల లేకపోవడం, కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియంపై ప్రభావం కారణంగా సరఫరా కొరత భయాలు కారణంగా, ధరలు పెద్దగా తగ్గడం లేదు. క్రూడ్ ఆయిల్ హెచ్చతగ్గులతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపొవచ్చు.

Read  Also.. Airtel 5G: 5G శకానికి ఎయిర్‌టెల్ సరికొత్త నాంది.. 1983 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌ ప్రతిసృష్టి..