బ్యాంక్ ఉద్యోగం రావాలంటే.. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలా? నిజం ఏంటంటే..?
బ్యాంకింగ్ ఉద్యోగాల ఎంపిక లో కీలక మార్పు చోటుచేసుకుంది. విద్యార్హతలతో పాటు అభ్యర్థుల వ్యక్తిగత ఆర్థిక ప్రవర్తన, క్రెడిట్ ప్రొఫైల్ ఇప్పుడు కీలక ప్రమాణంగా మారాయి. IBPS ద్వారా ఎంపికైన వారికి ఆరోగ్యకరమైన క్రెడిట్ హిస్టరీ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల ఎంపిక విధానంలో ఒక కొత్త మార్పు చోటుచేసుకుంటోంది. ఇప్పటి వరకు విద్యార్హతలు, పరీక్ష ఫలితాలు, ఇంటర్వ్యూ ప్రదర్శనలే ప్రధాన ప్రమాణాలుగా ఉండగా, ఇప్పుడు అభ్యర్థుల వ్యక్తిగత ఆర్థిక ప్రవర్తన కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా IBPS (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) ద్వారా ఎంపికైన అభ్యర్థుల విషయంలో ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేయడం ఈ మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, క్రెడిట్ ప్రొఫైల్‌ను ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇది దరఖాస్తు దశలో తప్పనిసరి కాదని, క్రెడిట్ హిస్టరీ లేని అభ్యర్థులకు ఇది ప్రతికూలంగా ఉండదని కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణను ఒక అదనపు అర్హతగా పరిగణించడం ప్రారంభమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు రోజువారీగా డబ్బు, సున్నితమైన డేటా, ముఖ్యమైన వ్యవస్థలతో పని చేస్తారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల క్రెడిట్ హిస్టరీ వారి బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనకు సూచికగా పరిగణించబడుతోంది. సకాలంలో EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం, డిఫాల్ట్‌లను నివారించడం వంటి అంశాలు ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ కు ముఖ్య సూచికలుగా మారాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది అభ్యర్థులను తిరస్కరించడానికి కాకుండా, వారి సమగ్ర ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. వ్యక్తి తన ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహిస్తాడో, అదే విధంగా ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వహించే అవకాశం ఉందని యజమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ధోరణి ప్రధానంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికే పరిమితమై ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఫిన్‌టెక్, బీమా వంటి ఇతర రంగాలకు కూడా విస్తరించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే ఇది సాధారణ నియామక ప్రమాణంగా మారే అవకాశం తక్కువగా ఉందని, పాత్ర-నిర్దిష్టంగా మాత్రమే కొనసాగుతుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
