
ప్రస్తుతం భారతీయుల జీవితంలో క్రెడిట్ కార్డు ఒక అనివార్య భాగమైంది. ఇటీవల వెల్లడైన నివేదికల ప్రకారం.. గతేడాది ఫెస్టివ్ సీజన్‌లో క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగింది. దాదాపు 42 శాతం మంది యూజర్లు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని షాపింగ్ కోసం ఖర్చు చేశారు. ఇందులో 20 శాతం మంది లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయడం విశేషం. అయితే ఖర్చు చేయడం ఎంత సులభమో, ఆ బిల్లును సకాలంలో చెల్లించడం అంతకంటే ముఖ్యం. లేదంటే మీ సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులను స్మార్ట్‌గా మేనేజ్ చేసి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవే..
బిజీ లైఫ్‌లో బిల్లు కట్టాల్సిన తేదీని మర్చిపోవడం సహజం. అందుకే మీ బ్యాంక్ అకౌంట్ నుండి Auto-pay ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల గడువు తేదీనాడు ఆటోమేటిక్‌గా బిల్లు చెల్లించబడుతుంది. పెనాల్టీలు, లేట్ ఫీజుల భయం ఉండదు.
నెల ఆఖరు వరకు ఆగకుండా మీ జీతం క్రెడిట్ అయిన వెంటనే క్రెడిట్ కార్డు బిల్లును క్లియర్ చేసే అలవాటు చేసుకోండి. దీనివల్ల ఇతర ఖర్చుల వల్ల డబ్బు అయిపోయి బిల్లు పెండింగ్‌లో పడే అవకాశం ఉండదు.
బ్యాంకులు పంపే ఇమెయిల్స్, ఎస్ఎమ్ఎస్‌లను ఎప్పటికప్పుడు గమనించండి. క్యాలెండర్‌లో రిమైండర్ సెట్ చేసుకోండి. మీ స్టేట్‌మెంట్‌ను నెలకు ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్ల ఏవైనా అదనపు ఛార్జీలు లేదా తప్పుగా జరిగిన ట్రాన్సాక్షన్లను గుర్తించవచ్చు.
చివరి నిమిషం వరకు వేచి చూడటం వల్ల టెక్నికల్ సమస్యలు వచ్చి పేమెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే డ్యూ డేట్ కంటే 4-5 రోజుల ముందే పేమెంట్ చేయడం సురక్షితం. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది.
ఒక్కోసారి ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి బిల్లు కట్టడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు కనీసం మినిమమ్ డ్యూ అయినా చెల్లించండి. దీనివల్ల డిఫాల్టర్ ముద్ర పడదు. కానీ మిగిలిన మొత్తంపై వడ్డీ పడుతుందని గుర్తుంచుకోండి. పెద్ద మొత్తంలో బిల్లు ఉన్నప్పుడు దానిని తక్కువ వడ్డీతో కూడిన ఈఎమ్ఐగా మార్చుకోవడం ఉత్తమం. బిల్లు అస్సలు కట్టకుండా ఉండటం కంటే ఇది మేలు. సిబిల్ స్కోర్‌లో క్రెడిట్ కార్డు పేమెంట్ హిస్టరీ కీలక పాత్ర పోషిస్తుంది. సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల భవిష్యత్తులో మీకు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..