
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చరిత్రలో ఇప్పటివరకు నమోదైన గరిష్ట స్థాయిని దాటి పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోల్డ్, సిల్వర్ ధరలు పెరగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. పెట్టుబడి పెట్టేందుకు ఇతర ఆఫ్షన్లను చూసుకుంటుున్నారు. దీంతో కాపర్ వైపు ఎక్కువమంది దృష్టి పెడుతున్నారు. ఇందులోకి పెట్టుబడులు పెరగడంతో బంగారం, వెండితో సమానంగా కాపర్ రేట్లు ఆమాంతం పెరుగుతున్నాయి. రాగి ధరలు తమ ర్యాలీని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ధరలు ఆల్ టై రికార్డు స్థాయి సృష్టించాయి. తాజాగా మల్టీ కమోడిటీ ఎక్చేంజ్‌లో ప్యూచర్ కాంట్రాక్ట్‌లో 1.30 శాతంకిపైగా పెరిగి కిలోకు రూ.1,330.45 వద్ద ట్రేడయ్యాయి. ఇది అత్యధిక గరిష్ట స్థాయిగా చెబుతున్నారు.
రూ.913.70 కనిష్ట స్థాయి నుంచి నాటకీయ పరిణామాల మధ్య పెరుగుతూ తాజాగా రూ.1392.95కు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. డిసెంబర్ ప్రారంభం నుంచి రాగి ధర ఊపందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కాపర్ ధర టన్నుకు 13 వేల కంటే ఎక్కువకు చేరుకుని రికార్డ్ సృష్టించడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం ఒక కారణంగా కనిపిస్తుండగా.. ఇక ఎలక్ట్రిక్ రంగం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ డేటా సెంటర్లు, గ్రిడ్ అప్ గ్రేడ్‌ల నుంచి డిమాండ్ పెరగడం కూడా మరో కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాల వల్ల రాగికి డిమాండ్ పెరిగిందని, దీని వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక లోటు వల్ల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఇక భౌగోళిక రాజకీయ అనిశ్చితి సరఫరా, డిమాండ్‌ను ప్రభావితం చేస్తుందని, ఈ అస్థిరత కాణంగా ధరలు రాబోయే రోజుల్లో హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
రాగి ధరలు పెరగుతుండటంతో వీటిని వెండితో పోలుస్తున్నారు. కొత్త వెండిగా వీటిని పరిగణిస్తున్నారు. విలువైన లోహంగా వెండి ఉండగా.. అది పారిశ్రామిక వస్తువుగా విలువ పొందుతుంది. ఇక ఆర్ధిక అనిశ్చితుల సమయంలో ఊహించని విధంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం పరిస్థితుల్లో రాగిని కూడా అలాంటి లోహంగానే పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాగికి వివిధ వస్తువుల తాయారీలో వాడుతుండటమే ధరలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. అలాగే బంగారం, వెండి ధరల పెరుగుదలతో రాగిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో కాపర్ ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.