
మీరు పాత అప్పులు తీర్చేశారా.. మీ సిబిల్ స్కోర్ పెరగడం కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారా అయితే మీకోసం ఒక గొప్ప వార్త. జనవరి 1 నుండి అమల్లోకి రానున్న ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలతో క్రెడిట్ స్కోర్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇకపై మీ ఆర్థిక లావాదేవీల సమాచారం కేవలం రెండు వారాల్లోనే అప్‌డేట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. బ్యాంకులు లేదా NBFCలు మీ రుణ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నివేదించడానికి 30 నుండి 45 రోజుల సమయం పడుతుంది. కానీ జనవరి 1 నుండి బ్యాంకులు నెలకు కనీసం రెండుసార్లు ఈ సమాచారాన్ని పంపాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనివల్ల మీరు లోన్ క్లోజ్ చేసినా లేదా కొత్త లోన్ తీసుకున్నా ఆ సమాచారం కేవలం 15 రోజుల్లోనే మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ప్రతిబింబిస్తుంది.
ఇల్లు లేదా కారు కొనాలనుకునే వారికి క్రెడిట్ స్కోర్ త్వరగా అప్‌డేట్ అవ్వడం వల్ల తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం పెరుగుతుంది. ఎవరైనా మీ పేరు మీద మోసపూరితంగా లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే క్రెడిట్ బ్యూరోలు వెంటనే మీకు SMS లేదా ఈమెయిల్ ద్వారా అలర్ట్ పంపుతాయి. మీ అకౌంట్‌ను డిఫాల్ట్‌గా మార్కప్ చేసే ముందు బ్యాంకులు కచ్చితంగా మీకు సమాచారం అందించాలి. దీనివల్ల పొరపాట్లను ముందే సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే, దానికి గల కచ్చితమైన కారణాన్ని బ్యాంకులు ఇకపై వివరించాలి.
మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏదైనా తప్పు ఉండి, దానిపై మీరు ఫిర్యాదు చేస్తే.. 30 రోజుల్లోపు దానిని పరిష్కరించాలి. ఒకవేళ బ్యాంకులు లేదా క్రెడిట్ బ్యూరోలు 30 రోజులు దాటిన తర్వాత కూడా సమస్యను పరిష్కరించకపోతే ప్రతి రోజుకు రూ. 100 చొప్పున బాధితుడికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధన వల్ల కస్టమర్ల ఫిర్యాదులు వేగంగా పరిష్కారం కానున్నాయి.
ఆర్‌బీఐ అంతటితో ఆగకుండా జూలై 1 నుండి వారానికోసారి డేటా అప్‌డేట్ చేసే విధానాన్ని ప్రతిపాదించింది. అంటే భవిష్యత్తులో ప్రతి నెల 7, 14, 21, 28 తేదీల్లో మీ క్రెడిట్ డేటా రిఫ్రెష్ అవుతుంది. దీనివల్ల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత మరింత పెరుగుతుంది. పెరుగుతున్న సైబర్ నేరాలు, క్రెడిట్ రిపోర్టింగ్ లోపాలను అరికట్టడానికి ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య రుణగ్రహీతలకు పెద్ద ఊరట. ఇకపై మీ క్రెడిట్ హిస్టరీ మీ చేతుల్లోనే మరింత డైనమిక్‌గా ఉండబోతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి