BYD Seal Electric car: భారతీయ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న‘సీల్’.. ఒక్కసారి చార్జ్ చేస్తే 700 కిలోమీటర్లు.. లాంచ్ డేట్ ఎప్పుడంటే..
చైనా ఈవీ దిగ్గజం బిల్డ్ యువర్ డ్రీమ్(బీవైడీ) కంపెనీ మన భారతీయ మార్కెట్ పై కన్నేసింది. బీవైడీకి చెందిన పలు మోడళ్లను ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించింది. ఇప్పుడు వాటిని ఆన్ లైన్ లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన చైనా ఈవీ దిగ్గజం బిల్డ్ యువర్ డ్రీమ్(బీవైడీ) కంపెనీ మన భారతీయ మార్కెట్ పై కన్నేసింది. బీవైడీకి చెందిన పలు మోడళ్లను ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శించింది. ఇప్పుడు వాటిని ఆన్ లైన్ లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బీవైడీ అట్టో3 ఈ ఎస్‌యూవీ, ఈ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ కార్లతో పాటు టెస్లాకు పోటీగా లాంచ్ చేసిన బీవైడీ సీల్ కారును కూడా ఆన్ లైన్ లో విక్రయాలను త్వరలో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.
ఏంటీ ఈ సీల్ ప్రత్యేకత..
బీవైడీ సీల్ కారు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. దీనిలో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీనిలోని మోటార్లు 522 హెచ్ పీ సామర్థ్యంతో 60 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు కేవలం 3.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. దీనిలో రెండు సామర్థ్యాల్లో బ్యాటరీ అందుబాటులో ఉంది. 61.4kwh, 82,5kwh సామర్థ్యాలతో బ్యాటరీలు ఉంటాయి.
బాడీ ఆర్కిటెక్చర్ ఇలా..
సీల్ ఈవీ కారులో బ్లేడ్ బ్యాటరీ సీటీబీ( సెల్ టు బాడీ) అనే పిలిచే బ్లేడ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇది వాహనాన్ని స్థిరంగా ప్రయాణించడానికి, ఎటువంటి ప్రదేశాల్లో తిరగిన సురక్షితంగా ఉండటానికి సాయపడుతుందని కంపెనీ ప్రకటించింది. ఇది ఎవరెస్ట్ శిఖరాన నెయిల్ పెనెట్రేషన్ టెస్ట్ లో విజయం సాధించిన ఏకైక కారు ఇదేనని బీవైడీ కంపెనీ వివరించింది.
ధర ఎంతంటే..
ధర విషయంలో ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ ఇప్పటికే అందుబాటులో ఉన్న బీవైడీ అట్టో 3 కంటే ఎక్కువగా ఈ సీల్ కారు ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు రూ. 45 లక్షల నుంచి 60 లక్షల వరకూ ఉండే అవకాశం ఉంది. మన ఇండియన్ మార్కెట్లో ఇది కియా ఈవీ6, హ్యూందాయ్ ఐయనిక్ 5 కార్లకు పోటీగా నిలబడుతుందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..