
2026 బడ్జెట్‌లో దేశ ప్రజలకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాన్యులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ల్లో మార్పులతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారికి మరింత బెనిఫిట్ జరిగేలా పన్ను మినహాయింపులు ఇవ్వనున్నారని సమాచారం. భారత్‌లో ఎక్కువమంది ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా డబ్బులు పొదుపు చేసుకుంటారు. వీటి ద్వారా వచ్చే వడ్డీ కేవలం ఆదాయంగానే కాకుండా ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తుకు భరోసాగా దేశ ప్రజలు భావిస్తారు. గత కొన్ని సంత్సరాలుగా ఇటువంటి ఆదాయంపై పన్ను మినహాయింపులు మారలేదు. వైద్య, రోజువారీ, మిగతా ఖర్చులు పెరుగతున్న క్రమంలో వీటిల్లో అధిక మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు ప్రజల నుంచి గత కొంతకాలంగా వస్తున్నాయి.
ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెట్టేవారికి మరింత లాభం జరిగేలా బడ్జెట్‌లో కేంద్రం నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సారి బడ్జెట్‌లో ఫ్లెక్సీ ఎఫ్‌డీ స్కీమ్‌ను కొత్తగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. దీని ద్వారా ఎఫ్‌డీ ద్వారా వచ్చే త్రైమాసిక వడ్డీని తిరిగి మళ్లీ పెట్టుబడి పెట్టే అవకాశం లభించనుందని తెలుస్తోంది. అలాగే ఎఫ్‌డీ ముందుగా ఉపసంహరించుకోవాలంటే ఇప్పటివరకు విధించే ఛార్జీలను రద్దు చేయనున్నారు. ఇక యూపీఐ యాప్స్ ద్వారా చేసే డిజిటల్ ఎఫ్‌డీలకు సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను మినహాయింపుల ఉండే అవకాశముందని తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80TTA కింద సినియర్ సిటిజన్లకు రూ.50 వేలకు పన్ను మినహాయింపు ఉంది. ఈ బడ్జెట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితిని రూ.లక్షకు పెంచనున్నారని తెలుస్తోంది. ఇక రూ.15 లక్షల్లోపు ఎఫ్‌డీ చేసే సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ చెల్లించేలా బడ్జెట్‌లో నిర్ణయాలు ఉండొచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ క్రెడిట్ అనే కొత్త వ్యవస్థను ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. దీని ద్వారా 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కవ పరిమితి గల ఎఫ్‌డీలపై రూ.2 లక్షల వరకు వచ్చే ఆదయాంపై 30 శాతం వరకు పన్ను మినహాయింపు ఉండొచ్చు.
ఇక చిన్న కంపెనీలకు చవక వడ్డీ రేటుకే రుణాలు అందించనున్నారు. 2026 బడ్జెట్‌లో ఈ నిర్ణయం ప్రకించనున్నారు. కేవలం 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకే MSMEలకు రుణాలు ఇచ్చే అవకాశముంది.