ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారం దేశంలో నడుస్తోంది. బాలికల భద్రత, విద్యను నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం. అయితే, ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచి వారి చదువు వరకు ఆర్థిక సాయం అందించే పథకం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కంటే ముందు దేశంలో మరొకటి ఉంది. 1997లో ప్రభుత్వం ‘బాలికా సమృద్ధి యోజన’ (బాలిక శిశు సంక్షేమ పథకం) ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచి వారి చదువు వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మొదట్లో ఒక కుమార్తె పుట్టినప్పుడు, తల్లికి ఆర్థిక సహాయంగా రూ. 500 అందుతుంది. తదనంతరం ఆ ఆడపిల్ల పదో తరగతి వరకు బాలిక విద్య, ప్రతి దశలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. మరి ఈ పథకం గురించి ఇతర విషయాలు ఏంటి? ఎలా అప్లయ్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) నివసిస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకం రూపొందించారు. ప్రతి కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల కోసం ఈ పథకాన్ని పొందవచ్చు. బాలికా సమృద్ధి యోజనకు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలలో ఆడపిల్ల జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల నివాసం, తల్లిదండ్రులు లేదా బంధువుల గుర్తింపు రుజువు అవసరం అవుతాయి. ఆమోదయోగ్యమైన గుర్తింపు రుజువుల్లో రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ వంటివి అవసరం కావచ్చు.
బాలికా సమృద్ధి యోజన కోసం దరఖాస్తు చేయడానికి మీరు దరఖాస్తును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సేవా కేంద్రాల నుండి పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఎలక్ట్రానిక్ రూపంలో ఫారమ్‌ను పూరించి సమర్పించాలి. గ్రామీణ, పట్టణ లబ్ధిదారుల కోసం వేర్వేరు ఫారమ్‌లు ఉంటాయని గుర్తించాలి. ముఖ్యంగా అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించాలని గమనించడం ముఖ్యం.ఈ పథకం కింద, బాలికల విద్య కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.
స్కాలర్‌షిప్ మొత్తం తరగతి వారీగా మారుతుంది. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి 300 ఇస్తారు. దీన్ని క్రమక్రమంగా పెంచుతూ తొమ్మిది, పదో తరగతి వచ్చేసరికి రూ.1000 సాయం చేస్తారు. బాలికా సమృద్ధి యోజన గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ద్వారా నిర్వహిస్తారు. అయితే ఆరోగ్య శాఖ అధికారులు పట్టణ ప్రాంతాల్లో పథకాన్ని పర్యవేక్షిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి