
కార్లు కేవలం హోదాకే కాదు, నేటి ఆధునిక జీవనశైలిలో కుటుంబ అవసరాలకు కూడా అత్యంత ముఖ్యమైనదిగా మారిపోయింది. దీంతో సొంత కారు కల నెరవేర్చుకోవడానికి ఎక్కువమంది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్ తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాంకులు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు సులువైన వాయిదాలతో రుణాలు అందిస్తున్నాయి. అయితే కారు రుణం తీసుకునే సమయంలో సరైన అవగాహన లేకపోతే.. ఆ ఆనందం కాస్తా ఆర్థిక భ భారంగా మారే ప్రమాదం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. లోన్ తీసుకుని కారు కొనుగోలు చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ప్రధాన పొరపాట్లు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చాలామంది ప్రతి నెలా చెల్లించే వాయిదా తక్కువగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ అది పూర్తి నిజం కాదు. ఈఎంఐ తక్కువగా ఉందంటే, మీరు రుణం చెల్లించే కాలపరిమితి ఎక్కువగా ఉందని అర్థం. లోన్ గడువు పెరిగేకొద్దీ మీరు కట్టే వడ్డీ మొత్తం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి కేవలం నెలవారీ వాయిదాను మాత్రమే కాకుండా లోన్ కాలపరిమితిని, మొత్తం వడ్డీని కూడా లెక్కించుకోవడం ముఖ్యం.
కారు కొనుగోలు చేయాలనే తొందరలో డీలర్ చూపించిన మొదటి లోన్ ఆఫర్‌కో లేదా మీ కంటికి కనిపించిన మొదటి బ్యాంక్ లోన్ ఆఫర్‌కు సంతకం చేయడం పెద్ద పొరపాటు. కనీసం 3 నుంచి 4 బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ క్లోజర్ ఛార్జీలను పోల్చి చూడాలి. వేర్వేరు ఆఫర్లను పోల్చడం వల్ల తక్కువ వడ్డీకే లోన్ లభించి, మీకు వేల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.
కొందరు తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని లోన్‌గా మార్చుకోవచ్చని భావిస్తుంటారు. ఇది తాత్కాలికంగా సులువుగా అనిపించినా దీర్ఘకాలంలో నష్టమే. డౌన్ పేమెంట్ ఎంత తక్కువ ఉంటే, బ్యాంక్ నుండి తీసుకునే రుణ మొత్తం అంత పెరుగుతుంది. దీనివల్ల వడ్డీ భారం పెరగడమే కాకుండా కొన్నిసార్లు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను కూడా విధించే అవకాశం ఉంది.
కాబట్టి కారు కొనేటప్పుడే గరిష్టంగా ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లించడం వల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
కారు కొనుగోలు అనేది నిరంతరం విలువ తగ్గే ఆస్తి. కాబట్టి మీ ఆదాయం, నెలవారీ బడ్జెట్‌ను సరిగ్గా అంచనా వేసుకుని.. వీలైనంత తక్కువ కాలపరిమితి, తక్కువ వడ్డీ రేటుతో ఉండే కార్ లోన్‌ను ఎంచుకోవడమే మంచిది.