సొంతింటి కల.. 30 ఏళ్లు అప్పుల తిప్పలేనా? హోమ్‌లోన్ తీసుకునేముందు ఇది తెలుసుకోండి!
భారత నగరాల్లో ఇళ్ల ధరలు ఆదాయాల కంటే వేగంగా పెరుగుతుండటంతో గృహ కొనుగోలుదారులు భారీ రుణాలపై ఆధారపడుతున్నారు. 25-30 ఏళ్ల హోమ్ లోన్లు, అధిక ఈఎంఐలు, ద్వంద్వ ఆదాయాలపై ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది. దీంతో పొదుపులు, పెట్టుబడులు, పదవీ విరమణ ప్రణాళికలపై ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలో సొంత ఇల్లు కల నెరవేర్చుకోవడం గతంతో పోలిస్తే మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఒకప్పుడు సంవత్సరాల పొదుపుతో డౌన్‌పేమెంట్ సమకూర్చుకుని ఇళ్లు కొనుగోలు చేసిన కుటుంబాలు, ఇప్పుడు ముందుగా బ్యాంకు ఎంత రుణం ఇస్తుందో తెలుసుకుని ఆ మేరకు ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నాయి. దీంతో అందుబాటు ధర ఆధారిత కొనుగోలు విధానం క్రమంగా రుణ అర్హత ఆధారిత విధానంగా మారుతోంది. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఆస్తి ధరలు ఆదాయాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా గృహ కొనుగోలుదారులు 25 నుంచి 30 ఏళ్ల వరకు సుదీర్ఘ గృహ రుణాలను ఎంచుకోవాల్సి వస్తోంది. అనేక కుటుంబాలు తమ నెలవారీ ఆదాయంలో 40 నుంచి 50 శాతం వరకు ఈఎంఐలకే కేటాయిస్తున్నాయి.
బ్యాంకులు ఇచ్చే గరిష్ట రుణ పరిమితిని వ్యక్తిగత చెల్లింపు సామర్థ్యంగా భావించడం పెద్ద పొరపాటు. నిర్వహణ ఖర్చులు, ఆస్తి పన్నులు, భవిష్యత్ వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల ప్రభావం గృహ రంగానికే పరిమితం కావడం లేదు. అధిక ఈఎంఐల కారణంగా కుటుంబాలు పదవీ విరమణ నిధులు, అత్యవసర నిధులు, దీర్ఘకాలిక పెట్టుబడులను తగ్గిస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక భద్రత దెబ్బతింటోంది. దేశీయ ఆర్థిక పొదుపుల శాతం కూడా గత కొన్నేళ్లలో తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, చాలా మంది రుణగ్రహీతలు పదవీ విరమణ తర్వాత కూడా గృహ రుణాలను కొనసాగించే పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగ నష్టం, ఆరోగ్య సమస్యలు లేదా ఆదాయంలో అంతరాయం వంటి అనుకోని పరిణామాలు ఎదురైతే కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే విలాసవంతమైన గృహ విభాగంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అధిక ఆదాయం, కుటుంబ సంపద లేదా పెద్ద మొత్తంలో డౌన్‌పేమెంట్ చేసే సామర్థ్యం ఉన్న కొనుగోలుదారులు ఇంకా మార్కెట్‌లో చురుకుగా ఉన్నారు. మొత్తంగా చూస్తే భారత గృహ మార్కెట్ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, ఆ వృద్ధికి ప్రధానంగా భవిష్యత్ ఆదాయాలపై ఆధారపడిన భారీ రుణాలే బలం అవుతున్నాయి. దీంతో ఇల్లు కొనడం కంటే ఆర్థిక భవిష్యత్తును ఎంతవరకు రక్షించుకుంటూ ఇల్లు కొనగలుగుతున్నాం? అనే ప్రశ్న ఇప్పుడు మరింత కీలకంగా మారింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
