Business Ideas: ఇంటి నుంచే వ్యాపారం స్టార్ట్ చేయాలకుంటున్నారా..? మహిళలకు బెస్ట్ ఆప్షన్.. ఖర్చు కూడా తక్కువే..
ఇంట్లోనే ఉండి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారం కోసం చూస్తున్నారా..? ఎలాంటి రిస్క్ లేని వ్యాపారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారా? అయితే పచ్చళ్ల వ్యాపారం ఒకటి. మహిళలు ఈ వ్యాపారం ద్వారా ఇంట్లోనే ఉండి ఆదాయం పొందవచ్చు.

తెలుగు ప్రజలకు పచ్చళ్ళు అంటే ఎంత మక్కువనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముద్ద దిగాలన్నా, పప్పులో మాండేటరీగా ఉండాలన్నా, విభిన్న రకాల రుచులను ఆస్వాదించాలన్నా పచ్చళ్ళ పాత్ర ఎంతో కీలకం. గతంలో ప్రతి ఇంట్లోనూ పచ్చళ్ళు తయారు చేసుకునేవారు. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో తయారీపై అవగాహన లేకపోవడంతో ప్యాక్ చేసిన పచ్చళ్ళకు, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే పచ్చళ్ళకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చికెన్ పచ్చడి నుండి ఆవకాయ వరకు.. అన్ని రకాల పచ్చళ్ళు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి పచ్చళ్ళ వ్యాపారం ఒక లాభదాయకమైన అవకాశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పచ్చళ్ళ మార్కెట్ విలువ అక్షరాలా 8.45 బిలియన్ డాలర్లు కాగా.. భారతదేశం నుండి అనేక దేశాలకు పచ్చళ్ళను ఎగుమతి చేస్తున్నారు. తక్కవ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనుకునేవారికి పచ్చళ్ళ వ్యాపారం మంచి ఆదాయ వనరుగా చెప్పవచ్చు. ఈ వ్యాపారం ఎలా మొదలుపెట్టాలనేది తెలుసుకుందాం.
వ్యాపార ప్రారంభానికి సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా కీలకం. పచ్చళ్ళకు డిమాండ్ ఎక్కువగా ఉండే పట్టణాలు, నగరాలు ఉత్తమమైన ఎంపికలుగా చెప్పవచ్చు. ఈ ప్రాంతాల్లో ప్రజలకు పచ్చళ్ళు తయారు చేసుకోవడానికి సమయం లేకపోవడంతో కొనుగోలుకు మొగ్గు చూపుతారు. ఒకే వీధిలో లేదా ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది పోటీదారులు ఉంటే.. మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంచుకోవడం మంచిది. అలాగే ముడిసరుకులు సులభంగా లభించే ప్రాంతాన్ని ఎంచుకుంటే రవాణా ఖర్చులు తగ్గుతాయి. పచ్చళ్ళ తయారీకి అవసరమైన అన్ని రకాల ముడిసరుకుల గురించి మీకు తెలిసి ఉండాలి. మంచి నాణ్యత గల ముడిసరుకులను తక్కువ ధరకు, విశ్వసనీయ సరఫరాదారుల నుండి పొందడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక పచ్చళ్ళ వ్యాపారం ఒక ఆహార వ్యాపారం కాబట్టి కొన్ని చట్టపరమైన అనుమతులు తప్పనిసరి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సర్టిఫికేట్ అవసరం పడుతుంది. మీ ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేసి, వినియోగానికి సురక్షితమైనవిగా నిర్ధారించిన తర్వాత FSSAI లైసెన్స్ జారీ చేస్తుంది. చిన్నస్థాయిలో ఇంట్లో తయారు చేసే వారికి ఇది అవసరం లేకపోయినా.. షాప్ పెట్టి వ్యాపారం చేయాలనుకునే వారికి తప్పనిసరిగా చెప్పవచ్చు.
ఒకవేళ మీరు దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటే షాప్ యాక్ట్ కింద నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ నుండి, పట్టణ లేదా నగర ప్రాంతాల్లో మునిసిపాలిటీ నుండి అనుమతులు పొందాలి. వ్యాపారం ప్రారంభించడానికి నిధులు అవసరం. మీ వద్ద తగినంత పెట్టుబడి లేకపోతే.. బ్యాంకుల నుండి వ్యాపార రుణాలను లేదా ప్రభుత్వ పథకాల కింద రుణాలను పొందవచ్చు. సూక్ష్మ, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముద్ర లోన్‌ను అందిస్తుంది. దీని కింద రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు వ్యాపార ప్రణాళిక, మీ సొంత పెట్టుబడి, క్రెడిట్ స్కోర్ (కనీసం 750), మీ వయస్సు (యువకులకు ప్రాధాన్యత) అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నాణ్యత ఎంత బాగున్నా.. ధర సరైన రీతిలో లేకపోతే వినియోగదారులు ఆకర్షితులు కారు. పోటీదారుల ధరలను పరిశీలించి, మీ తయారీ ఖర్చులను లెక్కించి, సహేతుకమైన లాభంతో ధరను నిర్ణయించాలి. ఇక మీ వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి సమర్థవంతమైన మార్కెటింగ్ చాలా అవసరం. గూగుల్ మ్యాప్స్‌లో మీ షాప్‌ను నమోదు చేయండి. స్విగ్గీ లాంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో భాగస్వామ్యం పొందండి. యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి మీ ఉత్పత్తులను చేరువ చేయవచ్చు..సరైన ప్రణాళిక, కష్టపడే తత్వం, నాణ్యతపై నిబద్ధత ఉంటే ఈ వ్యాపారంలో సులువుగా రాణించవచ్చు.
