ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ బడ్జెట్‌పైనే దేశంలో బులియన్ మార్కెట్ రంగం ఆశలు పెట్టకుంది. ముఖ్యంగా బంగారంపై జీఎస్టీ విషయంలో కేంద్ర నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాస్పెక్ట్ గ్లోబల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్, ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ కేంద్రం తీసుకునే చర్యలపై తన అంచనాలను ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక వారసత్వంలో బంగారు రంగం కీలక పాత్ర పోషిస్తుందని కాంబోజ్ చెప్పారు. దిగుమతి సుంకాలను తగ్గించడం వంటి పోటీతత్వాన్ని పెంచే విధానాలను తమ ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలు అక్రమ దిగుమతులను అరికట్టవచ్చని వివరించారు. అలాగే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లకు మద్దతు ఇచ్చే చర్యలపై బులియన్ మార్కెట్ కూడా ఆసక్తిగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమాలు నిష్క్రియ బంగారం నిల్వల విలువను అన్‌లాక్ చేయడంతో పాటు అధికారిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (ఈజీఆర్ఎస్)లో ట్రేడింగ్‌లో ఉన్న అడ్డంకులను పరిష్కరించేందుకు తక్షణ ప్రభుత్వ జోక్యం అవసరమని కాంబోజ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జీఎస్టీ సమ్మతిని క్రమబద్ధీకరించడంతో హాల్‌మార్కింగ్ నిబంధనలను స్పష్టం చేయాలని కోరుతున్నారు. కేంద్రం బంగారంపై తీసుకునే మార్పులు ఈ రంగం సామర్థ్యాన్ని విశ్వసనీయతను బలోపేతం చేస్తాయని కాంబోజ్ చెప్పారు. గ్రామీణ పొదుపు, ఉపాధికి అంటే ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) గణనీయమైన సహకారాన్ని అందించే బంగారు రంగం, స్థిరత్వాన్ని నిర్ధారించే ఆర్థిక విధానాలను కోరుకుంటుందని వివరించారు. గిఫ్ట్ సిటీలో నగల ఎగుమతి కేంద్రాలు, టైర్ 2 నగరాల్లో చిన్న జ్యువెలరీ పార్కులను ఏర్పాటు చేయాలని పరిశ్రమ వాటాదారులు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలతో బంగారం ఎగుమతులు భారీగా పెంచుతాయని కాంబోజ్ చెప్పారు.
నవంబర్‌లో భారతదేశానికి సంబంధించిన చారిత్రాత్మక బంగారం దిగుమతిని భారీగా సవరించారు. జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 796 టన్నుల నుంచి 664 టన్నులకు సవరించారు. జనవరి 8న వెల్లడించిన వివరాల ప్రకారం చరిత్రలో ఏ వస్తువుకైనా ఇది అతిపెద్ద సవరణగా బులియన్ మార్కెట్ చెబుతుంది. డబుల్ కౌంటింగ్ కారణంగా మునుపటి గణాంకాలు పెరిగిపోయాయని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి