Budget 2026: బడ్జెట్ తర్వాత హోమ్ లోన్ ఈఎంఐ తగ్గుతుందా..? పెరుగుతుందా..?.. నిర్మలమ్మ లెక్కలు ఎలా ఉంటాయి..?

మధ్యతరగతి మనిషికి సొంతింటి కల ఒక ఎమోషన్ అయితే.. ప్రతి నెలా కట్టే EMI ఒక మోయలేని భారం. ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు.. దానికి తోడు భారంగా మారిన వడ్డీ రేట్ల మధ్య సామాన్యుడి జేబు చిల్లులు పడుతోంది. ఈ నేపథ్యంలోనే యావత్ దేశం కళ్లు ఇప్పుడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌పైనే ఉన్నాయి.

Budget 2026: బడ్జెట్ తర్వాత హోమ్ లోన్ ఈఎంఐ తగ్గుతుందా..? పెరుగుతుందా..?.. నిర్మలమ్మ లెక్కలు ఎలా ఉంటాయి..?
Budget 2026 India Expectations

Updated on: Jan 30, 2026 | 3:32 PM

ప్రస్తుతం దేశంలోని అందరి చూపు ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పైనే ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా ఆమె 9వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఒకవైపు ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు భారంగా మారుతున్న హోమ్ లోన్ ఈఎంఐలు.. వెరసి సామాన్యుడి చూపు ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఉంది. ఈసారి ప్రభుత్వం ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ చేస్తోంది. గత పదేళ్లుగా ఇళ్ల ధరలు రెట్టింపు అయ్యాయి. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(b) కింద ఇచ్చే వడ్డీ మినహాయింపు మాత్రం రూ. 2 లక్షల వద్దే ఆగిపోయింది. ఈ పరిమితిని కనీసం రూ.4 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని CREDAI వంటి సంస్థలు గట్టిగా కోరుతున్నాయి. ఇదే కనుక జరిగితే హోమ్ లోన్ తీసుకున్న వారికి పన్ను రూపంలో భారీ ఆదా లభిస్తుంది.

సరసమైన ఇల్లు అంటే ఏమిటి?

ప్రస్తుతం రూ.45 లక్షల వరకు ఉన్న ఇంటిని మాత్రమే సరసమైన ఇల్లుగా పరిగణిస్తున్నారు. కానీ నేటి మార్కెట్ రేట్ల ప్రకారం పట్టణాల్లో ఈ ధరకు ఇల్లు దొరకడం గగనమైపోయింది. ఈ పరిమితిని రూ. 65-75 లక్షలకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ మంది సబ్సిడీలు, చౌక రుణాల పరిధిలోకి వస్తారు. ఎందుకంటే సరసమైన ఇళ్లకు తక్కువ జీఎస్టీ, అదనపు పన్ను మినహాయింపులు ఉంటాయి.

సెక్షన్ 80C లో హోమ్ లోన్‌కి ప్రత్యేక స్థానం?

ప్రస్తుతం సెక్షన్ 80C కింద ఇచ్చే రూ.1.5 లక్షల మినహాయింపులో పీపీఎఫ్, ఎల్ఐసీ, పిల్లల ఫీజులు అన్నీ ఇరుక్కుపోయి ఉన్నాయి. హోమ్ లోన్ అసలు కోసం ఒక ప్రత్యేక సెక్షన్‌ను కేటాయించాలని మధ్యతరగతి వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల పొదుపుతో సంబంధం లేకుండా ఇంటి అప్పుపై పూర్తిస్థాయి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో హోమ్ రుణ వడ్డీపై ఎటువంటి మినహాయింపు లేదు. ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలంటే ఇందులో కూడా హోమ్ లోన్,ఇన్సూరెన్స్ తగ్గింపులను చేర్చక తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జేబు ఖాళీ అవుతుందా.. ఊరట లభిస్తుందా?

బడ్జెట్ నేరుగా వడ్డీ రేట్లను తగ్గించకపోయినా, పన్ను మినహాయింపుల ద్వారా సామాన్యుడి చేతిలో ఎక్కువ డబ్బు మిగిలేలా చేయగలదు. ఫిబ్రవరి 1న నిర్మలమ్మ చేసే ప్రకటనలు మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కలను మరింత సులభతరం చేస్తాయా లేదా అన్నది సస్పెన్స్.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి