బంగారానికి భారతీయులిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దాని ధర ఎంత పెరుగుతోందో దానిపై ఆసక్తి అంతగా పెరిగిపోతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గాలన్న ఆర్థిక సూత్రానికి విరుద్ధం బంగారం. కాని, ఈసారి పండగ సీజన్‌లో బంగారం కొంత కళతప్పింది. ధర ఆకాశాన్ని అంటడంతో రిటెయిల్ అమ్మకాలు తగ్గాయి.చాలా మంది కొనుగోలుదారులు నగల కొనుగోలును వాయిదా వేస్తున్నారు లేదంటే తక్కువ మొత్తంలో కొంటున్నారు. అందుకే ఈ ఏడాది ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై భారతీయ ఆభరణాల రంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. బంగారంపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని జెమ్ & జుయెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ విజ్ఞప్తి చేస్తోంది.
ప్రస్తుతం బంగారంపై 12.5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. 2.5 శాతం అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్, 3 శాతం GST దీనికి అదనం. అంటే బంగారం ప్రస్తుత ధరలో పన్నుల వాటానే 18 శాతంగా ఉంటుంది. కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు గతేడాది బడ్జెట్‌లో 7.5 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని పెంచారు. బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై ఇంపోర్ట్ డ్యూటీని 4 శాతానికి తగ్గించాలని జెమ్ & జుయెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కోరుతోంది. ఈ విషయమై ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు కూడా అందజేసింది.
కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో బంగారం దిగుమతిలో గణనీయమైన తరుగుదల నమోదైంది. 2021లో 1068 టన్నుల బంగారం దిగుమతి ఉండగా 2022లో ఇది 706 టన్నులకు తగ్గిపోయింది. మరో వైపు డ్యూటీ పెంపు కారణంగా ఇండియాలోకి బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది. దాదాపు 200 టన్నుల బంగారం ఇండియాలోకి స్మగుల్ అయిందని అంచనా. ఇండియాలో బంగారం రిటెయిల్ సేల్స్‌ను నడిపిస్తున్నది ఈ స్మగుల్డ్ బంగారమే.
భారతీయ గోల్డ్ మార్కెట్‌లో ఆర్గనైజ్డ్ రిటెయిలర్ల వాటా 36 శాతంగా చెప్పుకోవచ్చు. మిగిలినదంతా అవ్యవస్థీకృత రంగానిదే. స్మగుల్ అయిన బంగారాన్ని కొనుగోలు చేసే అవ్యవస్థీకృత రంగం వాటితో ఆభరణాలుగా తయారు చేసి విక్రయిస్తూ ఉంటుంది.
బంగారానికి ధర అధికంగా ఉండటంతో ఈ మధ్య కాలంలో చాలా మంది బంగారాన్ని అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనపడుతుండటం, ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు, కొన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడంతో పాటు పెద్ద పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తుండటంతో పసిడి ధర కొండెక్కుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంపోర్టు డ్యూటీని తగ్గిస్తే ఆర్థిక అవకతవకలు తగ్గుతాయని జెమ్ & జుయెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అభిప్రాయపడుతోంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం