ద్విచక్ర వాహనాల మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ కు ప్రముఖ స్థానం ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాహనాలు ప్రజల ఆదరణ పొందాయి. ఆ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాటా దాదాపు 25 శాతం ఉందని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవల ఈ కంపెనీ స్కూటర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. సర్వీసింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. ఈ విషయంపై కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో అనేక పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఓలా ఎలక్ట్రిక్ షేర్ల ధరలు దారుణంగా పడిపోయాయి. దాదాపు 44 శాతం తగ్గిపోయాయి. గతంతో పోల్చితే షేర్ 3.03 శాతం పడిపోయి రూ.87.46 వద్జ స్థిరపడింది. ఆగస్టు 20వ తేదీన ఈ షేరు ధర రికార్డు స్థాయిలో రూ.157.53గా నమోదైంది. ఆ లెక్క ప్రకారం ప్రస్తుతం దాదాపు 44.48 శాతం క్షీణించింది.
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్లు సోమవారం వరసగా మూడో సెషన్ లో కూడా పతనాన్ని కొనసాగించాయి. దీని ధర రూ.87.46 వద్ద స్థిర పడింది. అయితే దాని లిస్టింగ్ ధర మాత్రం రూ.76 నుంచి 15.07 శాతం పెరిగింది. ఈ కంపెనీ అక్టోబర్ 14 నాటికి 15,672 వాహనాల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఇది మార్కెట్ వాటాలో 34 శాతంగా ఉంది. అయితే ఓలా ఎలక్ట్రిక్ కొన్నిసమస్యలను ఎదుర్కొంటోంది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, తప్పు దారి పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య విధానాల ఆరోపణలపై ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసు అందుకుంది. ఇవన్నీ ఓలా షేర్ల ధర క్షీణించడానికి కారణమని భావిస్తున్నారు. అయితే కంపెనీ మాత్రం నోటీసు వల్ల తమ ఆర్థిక కార్యాచరణ, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదని చెబుతోంది.
ఓలా షేర్ల ధర పతకం అవుతున్న నేపథ్యంలో వాటిపై మార్కెట్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అధిక రిస్క్ తీసుకునే పెట్టుబడి దారులు ప్రస్తుత పరిస్థితిలో పొజిషన్లు తీసుకోవాలంటున్నారు. పెట్టుబడిదారులు ఓలా ఎలక్ట్రిక్ షేర్లను దాదాపు రూ.85 స్థాయిలో కొనుగోలు చేయడాన్ని రూ.95 అప్ సైడ్ టార్గెట్ తో పరిగణించాలని, ఈ ట్రేడ్ కు రూ.80 వద్ద కచ్చితమైన స్టాప్ లాస్ ఉంచాలన్నారు.
ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ మార్కెట్ లోని ప్రవేశించింది. పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు దాని స్టాక్ లను కొనుగోలు చేశారు. ఐపీవో ఇష్యూ ధర రూ.70 కాగా.. ఆగస్టులో రూ.157 చేరుకుంది. దీంతో పెట్టుబడిదారులకు లాభాలు బాగా వచ్చాయి. కానీ ఆ తర్వాత షేర్ ధర పతనం కావడం ప్రారంభించింది. ప్రస్తుతానికి 87.46 వద్ద కొనసాగుతోంది. ఓలా షేర్ల పతనం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ స్కూటర్లపై వెల్లువెత్తుతున్న విమర్శలు, కంపెనీ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ వివాదం, ఎలక్ట్రిక్ విభాగంలోకి బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ ప్రవేశించడం కారణాలని భావిస్తున్నారు. దీంతో ఓలా షేర్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. వాటాలు మరింత క్షీణిస్తాయనే భయంతో వాటా దారులు విక్రయానికి మొగ్గు చూపుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..