దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజమైన బజాజ్ కు వినియోగదారుల ఆదరణ చాలా ఎక్కువ. దీని నుంచి విడుదలయ్యే వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతంలో విడుదలైన చేతక్ స్కూటర్ కు ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ఫీచర్లతో కొత్త వాహనాలను తయారు చేస్తూ బజాజ్ ఆటో ముందుకు దూసుకుపోతోంది. దీనిలో భాగంగా ఈ సంస్థ రెండు కొత్త మోటారు సైకిళ్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటికి ట్రయాంఫ్ స్పీడ్ టీ4, ఎంవై 25 స్పీడ్ 400 అని పేర్లు పెట్టింది. బ్రిటీష్ మోటారు సైకిల్ బ్రాండ్ అయిన ట్రయంఫ్ తో కలిసి వీటిని రూపొందించింది. వీటి ధరలను రూ.2.17 లక్షలు, రూ.2.40 లక్షలుగా నిర్దారించింది. ఈ నెల చివరి నుంచి ఈ వాహనాలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
ట్రయంఫ్ స్పీడ్ టీ4 మోటారు సైకిల్ రూ.2.17 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందుబాటులో ఉంది. దాని పేరులోని టి అనే అక్షరం టార్క్ ను సూచిస్తుంది. అలాగే 4 దాని 400 సీసీ ఇంజిన్‌ను తెలుపుతుంది. గతంలో తీసుకువచ్చిన స్పీడ్ 400 కంటే ఈ మోడల్ ఇంధన సామర్థ్యం పది శాతం ఎక్కువ అని కంపెనీ తెలిపింది.
బజాజ్ ఆటో విడుదల చేసిన ఎంవై 25 స్పీడ్ 400 మోటారు సైకిల్ ధర రూ.2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). నవీకరించిన ఈ విభాగంలో కొత్త రంగులు, డిజైన్లు తీసుకువచ్చారు. ఇది హై ప్రొఫైల్ రేడియల్ టైర్లు, ఫ్రంట్ బ్రేక్ మరియు క్లచ్ కోసం ఐదు దశల సర్దుబాటు లివర్లతో వస్తుంది. ఈ వాహనం ఎల్లో, పెరల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ అనే నాలుగు రకాల రంగులలో అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..