ఈ మధ్యకాలంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లపై కస్టమర్లలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి కార్లకు ఉన్న ప్రత్యేకత ఒకటే.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో మనం పదేపదే గేర్లను మార్చాల్సిన పనిలేదు. అయితే ఆటోమేటిక్ కార్ల ధరలు మాన్యువల్ కార్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితేనేం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లను మనం సరసనమైన ధరలలోనే పొందగలం. దాదాపుగా రూ. 11 లక్షలకు పైగా ధర పలికే కార్లలో ఉండే ఫీచర్లు రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లలో వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
మారుతి హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 2 వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ల ధరలు రూ. 6 లక్షల కంటే తక్కువ. ఇందులో, S-Presso VXi Opt AT ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.65 లక్షలు, S-Presso VXi Plus Opt AT ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలు. ఈ కారులో 998 cc పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉంది. అలాగే మారుతీ ఆటోమేటిక్ కార్ల 2 వేరియంట్లు 21.7 kmpl మైలేజీని అందిస్తాయి. మారుతి S ప్రెస్సో కారులో EPSతో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ లభిస్తోంది.
సరసమైన ధరలో ఆటోమేటిక్ కారు కావాలనుకుంటున్న కస్టమర్లకు, రెనాల్ట్ హ్యాచ్‌బ్యాక్ KWID 1.0 RXT AMT ఒక గొప్ప ఎంపిక. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.79 లక్షలు. అలాగే రెనాల్ట్ క్విడ్ మరొక వేరియంట్ రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలు. ఈ రెండు వేరియంట్లు 22.0 kmpl వరకు మైలేజీని అందిస్తాయి.
హ్యుందాయ్ కంపెనీ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు శాంట్రో స్పోర్ట్స్ AMT వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ హ్యుందాయ్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షలు. ఈ కారు మైలేజీ 20.3kmpl వరకు ఇస్తుంది. హ్యుందాయ్ శాంత్రో 1086 cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. అలాగే ఇది 68.05 hp శక్తిని ఉత్పత్తి చేయగలదు.