బ్యాంకు ఉద్యోగులు పలు డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్లను పరిష్కరలించాలని బ్యాంకు యూనియన్లు జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసింది.
తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం తెలిపింది. ఉద్యోగుల డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడంతో సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. సమ్మె వాయిదా పడడంతో ఈ నెల 30, 31 తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు. మరి 31వ తేదీన జరిగే సమావేశంలో అధికారులు ఉద్యోగుల డిమాండ్లపై ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..