కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ రకాల పథకాలను అమలు చేస్తుండగా, పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా మోడీ సర్కార్ పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్‌లో చేరినట్లయితే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. ఆ సమయంలో మీకు ఎవరి సహాయం అవసరం లేకుండా కేంద్రం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులతో జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు. అయితే మీరు సంపాదిస్తున్నప్పుడు డబ్బులు పొదుపు చేయకపోతే పదవీ విరమణ తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.
నెలవారీ పెన్షన్ వచ్చేలా మీరు ముందుగానే ఆర్థిక ప్రణాళికను ప్రారంభించాలి. మీకు ఎంత పింఛను అవసరం లేదా నెలవారీ ఆదాయం ఎంత అవసరం, అలాగే దాని ప్రకారం పెట్టుబడి పెట్టండి. ఇలా అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక రాబడికి అవకాశం ఉంది. కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ లేని పెట్టుబడి ఎంపికలలో కొన్ని ప్రభుత్వ-ప్రాయోజిత పెన్షన్ పథకాలు ఉన్నాయి. అందులో అటల్ పెన్షన్ స్కీమ్ ఒకటి.
ఇది 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల తక్కువ ఆదాయ వర్గ వ్యక్తుల పదవీ విరమణ జీవితానికి ఆధారాన్ని అందించడానికి రూపొందించబడిన పథకం. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందేందుకు ఈ పథకం సహాయపడుతుంది. ఈ పథకంలో మీ పెట్టుబడితో పాటు, ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,000 వరకు నిధులను కూడా అందిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన పొందేందుకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. మీరు ఆ వయస్సులో పథకాన్ని పొందినట్లయితే మీరు 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు రూ.1,454 చెల్లిస్తే నెలవారీ రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. పింఛను తక్కువ, నెలవారీ వాయిదా తగ్గుతుంది. ఉదాహరణకు రూ.1000 నెలవారీ పెన్షన్ కావాలంటే నెలకు రూ.291 పెట్టుబడి సరిపోతుంది. అదే18 ఏళ్ల నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెడితే, నెలకు రూ.210 చెల్లిస్తే రూ.5,000 నెలవారీ పెన్షన్ పొందవచ్చు.
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ అటల్ పెన్షన్ స్కీమ్‌ను పొందవచ్చు. అయితే, వారు ఏ ఇతర ప్రభుత్వ ప్రాయోజిత సామాజిక భద్రతా పథకాలను కలిగి ఉండకూడదు. అలాగే పన్ను చెల్లింపుదారుగా కూడా ఉండకూడదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి