బీ అలర్ట్‌.. ఆ ప్లాట్లు కొన్నవారికి రెరా వార్నింగ్‌! మార్చి 31 డెడ్‌లైన్‌.. అది దాటితే అంతే!

ఆంధ్రప్రదేశ్‌ రెరా (RERA) డెవలపర్లు, కొనుగోలుదారులకు కీలక సూచనలు చేసింది. మార్చి 31లోపు ప్రాజెక్టులను రెరాలో నమోదు చేయాలని, లేకుంటే భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. రెరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని సూచించింది. కొనుగోలుదారుల ప్రయోజనాలే లక్ష్యంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.

బీ అలర్ట్‌.. ఆ ప్లాట్లు కొన్నవారికి రెరా వార్నింగ్‌! మార్చి 31 డెడ్‌లైన్‌.. అది దాటితే అంతే!
Ap Rera

Updated on: Jan 13, 2026 | 8:13 AM

ఆంధ్రప్రదేశ్‌ రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) వెంచర్‌ డెవలపర్లకు, ప్లాట్ల కొనుగోలుదారులకు కీలక సూచనలు చేసింది. రెరాలో ఇప్పటి వరకు నిర్మాణదారులు, డెవలపర్లు, కొనుగోలుదారులు వారి ప్రాజెక్టులను నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్‌ శివారెడ్డి సూచించారు.

రెరా అనుమతి లేని వెంచర్‌లో ప్లాట్లు, ఫ్లాట్‌లు కొని వినియోగదారులు నష్టపోవద్దని సూచించారు. 2019లో ప్రభుత్వం మారడం, కరోనా పరిణామాల వల్ల చాలా మంది నిర్మాణదారులు, డెవలపర్లు, కొనుగోలుదారులు రెరాలో వారి ప్రాజెక్టులను నమోదు చేసుకోలేదని అన్నారు. అలాంటివారికి మార్చి 31 వరకు అవకాశం కల్పించామని తెలిపారు. క్వార్టర్లీ అప్డేట్స్‌ సకాలంలో దాఖలు చేయని డెవలపర్లకు కూడా 50 శాతం పెనాల్టీపై దాఖలు చేసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

అథారిటీలో తమ ప్రాజెక్టులను నమోదు చేసుకోని వారు కనీసం ప్రకటనలు ఇవ్వడం గానీ, విక్రయించడంగానీ, అగ్రిమెంట్‌ చేసుకోవడం గానీ చేయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపైన ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం పెనాల్టీ విధిస్తామని చైర్మన్‌ శివారెడ్డి హెచ్చరించారు. డాక్యుమెంటేషన్‌ అంతా రెరా వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చన్నారు. నూతన రెరా కమిటీ ఏర్పాటై నాలుగు నెలలు అయిన సందర్భంగా కొనుగోలుదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉమ్మడి 13 జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో కడపలో అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి