Anil Ambani: అనిల్‌ అంబానీ కీలక నిర్ణయం.. పూర్వ వైభవం కోసం సరికొత్త ప్రయత్నం

|

Sep 08, 2024 | 4:38 PM

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు అనిల్‌ అంబానీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుందని సమాచారం....

Anil Ambani: అనిల్‌ అంబానీ కీలక నిర్ణయం.. పూర్వ వైభవం కోసం సరికొత్త ప్రయత్నం
Anil Ambani
Follow us on

సోదరుడు ముకేష్‌ అంబానీ ఓవైపు వ్యాపార రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతూ.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతుంటూ మరోవైపు అనిల్‌ అంబానీ మాత్రం అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. అన్ని రంగాల్లో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా మళ్లీ పూర్వ వైభవం వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు అనిల్‌ అంబానీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుందని సమాచారం. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.

రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొదట ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇందుకు అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలకు సంబంధించిన వాటిపై అధ్యయనం చేపడుతోంది. అయితే ఈ లక్ష్యాన్ని 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలక్ట్రిక్‌ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి 10 గిగావాట్‌ హవర్స్‌ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్‌ హవర్స్‌కి విస్తరించాలనే ప్రణాళికతో రిలయన్స్‌ ఉన్నట్లు సమాచారం. కంపెనీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే ఈ ప్రభావం మొదలైంది. ఈ వార్తలు బయటకు రాగానే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ద్వారా అనిల్‌ అంబానీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. మరి అనిల్‌ అంబానీ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..