
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ కమోడిటీ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక లోహమైన అల్యూమినియం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడుతుందనే భయాందోళనల మధ్య, సోమవారం అల్యూమినియం ధరలు గత నాలుగు ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అల్యూమినియం ధరల జోరు మామూలుగా లేదు.
ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో సుమారు 9శాతం వాటా కలిగిన కీలకమైన గల్ఫ్ జలమార్గం హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయం కలగడం ప్రధాన కారణం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం ఈ మార్గాన్ని ప్రమాదంలో పడేసింది. ఖతార్‌కు చెందిన ఖతాలమ్ స్మెల్టర్ తన ఉత్పత్తిని తగ్గించడం, అలాగే అల్యూమినియం బహ్రెయిన్ షిప్‌మెంట్‌లపై ఫోర్స్ మేజర్ ప్రకటించడంతో మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. అల్యూమినియం తయారీకి భారీగా విద్యుత్ అవసరం. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం కలిగితే, స్మెల్టర్ల పనితీరు దెబ్బతింటుందనే ఆందోళన నెలకొంది.
సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ బలంగా ఉండటంతో బులియన్ మార్కెట్ ఒత్తిడికి లోనైంది. బంగారం, వెండి ధరలు దాదాపు 3.5శాతం వరకు పతనమవ్వడం గమనార్హం. ప్రస్తుతం MCXలో బంగారం ధర రూ.1.61 లక్షల కంటే తక్కువకు పడిపోయింది.
కోటక్ సెక్యూరిటీస్ నిపుణుడు అనింద్య బెనర్జీ అభిప్రాయం ప్రకారం.. మధ్యప్రాచ్యం ఏటా 65 లక్షల టన్నుల అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. సరఫరా గొలుసులో ఇబ్బందులు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో అల్యూమినియం ధర టన్నుకు 3,800 డాలర్ల నుండి 4,000 డాలర్ల వరకు చేరే అవకాశం ఉంది అని ING కమోడిటీ స్ట్రాటజిస్ట్ ఎవా మాంథే అంచనా వేశారు. నిర్మాణ రంగం, ప్యాకేజింగ్, ఆటోమొబైల్ పరిశ్రమల్లో అల్యూమినియం వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ధరల పెరుగుదల ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.