
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచములు ధరలు భారీగా పెరిగాయి.ఈ నేపథ్యంలో దేశీ ప్రభుత్వం రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. హై-ఎండ్ లగ్జరీ కార్లు, సూపర్ బైక్‌లలో ఉపయోగించే ఎక్స్‌పీ100 పెట్రోల్ ధరను లీటరుకు రూ.11 పెంచింది. దీంతో ఎక్స్‌పీ100 లీటర్ పెట్రోల్ ధర రూ.160కి చేర్చారు. ప్రీమియం డీజిల్ వేరియంట్ ‘ఎక్స్‌ట్రా గ్రీన్’ ధరను లీటరుకు రూ.91.49 నుంచి రూ.92.99కి పెంచింది.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుండి రూ.3కి, డీసెల్‌పై రూ.10 నుండి సున్నాకి తగ్గించింది. అయినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వినియోగదారులకు తక్షణ ఉపశమనం లభించే సూచనలు తక్కువగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా బుధవారం చమురు కంపెనీలు 19 కేజీల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.195.50 పెంచాయి. ఢిల్లీలో ఇప్పుడు ఒక కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.2,078.50కి చేరింది. దీనితో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలోలీటరుకు టెర్బైన్ ప్యూల్ ధర రూ.2.07 లక్షల రికార్డు స్థాయికి చేరడంతో, విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు పెరిగాయి. ఇక జెట్ ఫ్యూయల్ ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షలు దాటడం ఇదే మొదటిసారి. అయితే, దేశీయ విమానయాన సంస్థలు జెట్ ఇంధన ధరలలో కేవలం 8.5 శాతం పెంచినట్టు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.