
అపర కుబేరుడు గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే అనే రంగాల్లో అదానీ గ్రూప్ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది. తాజాగా అదానీ గ్రూప్ తన విమానాశ్రయ వ్యాపారాన్ని మరింతగా విస్తరించనుంది. వచ్చే అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఈ రంగంలో పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ గ్రూప్ విమానాశ్రయ వ్యాపారాధిపతి జీత్ అదానీ వెల్లడించారు. అదానీ గ్రూప్ మనదేశంలో ముంబయి సీఎస్‌ఎమ్‌ఐఏ సహా 7 విమానాశ్రయాలను ఇప్పటికే నిర్వహిస్తుండగా, వచ్చే అక్టోబర్ నాటికి నవీ ముంబయి విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోనుంది.
విమానాశ్రయ నిర్వహణలో ఇండియాలో దూసుకెళ్తున్న అదానీ గ్రూప్ ప్రస్తుతానికి ఇతర దేశాల్లో విమానాశ్రయాలకు విస్తరించే ప్రణాళికలు లేవని జీత్ తెలిపారు. ‘మనదేశంలోనే వచ్చే 10-15 ఏళ్లలో విమానయానంలో భారీ వృద్ధి అవకాశాలున్నాయని మేం భావిస్తున్నాం. పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య) పద్ధతిలో అభివృద్ధి చేయడానికి 26 విమానాశ్రయాలను గుర్తించారు. అందుకే విదేశాల కంటే ఇక్కడే బలంగా విస్తరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో విమానాశ్రయ మౌలిక వసతులు, స్థిరాస్తులపై రూ.95,000-96,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు జీత్ తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం నవీ ముంబయి విమానాశ్రయం, ముంబయి విమానాశ్రయంపైనే పెట్టనున్నట్లు తెలిపారు.
నవీ ముంబయిలో రూ.19,000 కోట్లతో 2 కోట్ల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యంతో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నాం. ఇక్కడ నిర్మించబోయే టీ2లోనూ 3 కోట్ల మంది ప్రయాణించేలా రూ.30,000 కోట్లు, లేదా 5 కోట్ల మంది ప్రయాణించేలా రూ.40,000-45,000 కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు. అలాగే అహ్మదాబాద్, జయపుర, తిరువనంతపురంలలో కొత్త టెర్మినళ్ల ఏర్పాటు ప్రణాళికలూ ఉన్నాయని, వీటితో పాటు లఖ్‌నవూలో కొత్త టెర్మినల్ విస్తరణ కూడా ఉంటుందని, గువహటిలో కొత్త టెర్మినల్‌ను అక్టోబరు-నవంబరుకల్లా అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీత్ వెల్లడించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి