Adani Group: వరుసగా కొత్త కంపెనీలను కొంటూ పోతున్న అదానీ గ్రూప్ తాజాగా మరో డీల్ చేసుకుంది. ఈ సారి డిఫెన్స్ రంగంలో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అదానీకి ఇది ఉపకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జనరల్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎమ్ఓయూ కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా వాణిజ్య రోబోటిక్ డ్రోన్‌లు, పంటల రక్షణ, పంట ఆరోగ్యం, ఖచ్చితత్వ వ్యవసాయం, దిగుబడి పర్యవేక్షణకు డ్రోన్ ఆధారిత పరిష్కారాలను అందించేందుకు కంపెనీ తెలిపింది. రానున్న కాలంలో వ్యవసాయ రంగానికి అనేక మోడ్రన్ పరిష్కారాలను కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది.
అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ దాని సైనిక డ్రోన్లు, AI/ ML సామర్థ్యాలను ఉపయోగించుకుంటుందని తెలుస్తోంది. దేశీయ వ్యవసాయ రంగానికి ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను అందించడానికి జనరల్ ఏరోనాటిక్స్‌తో కలిసి పని చేస్తుందని కంపెనీ తన ఫైలింగ్స్ లో తెలిపింది. ఈ డీల్ క్లోజ్ చేసేందుకు చివరి గడువు జూలై 31, 2022 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశీయ డ్రోన్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించిన తరుణంలో ఈ కొనుగోలు జరిగటం విశేషంగా నిలిచింది.
భవిష్యత్తులో డ్రోన్ల వినియోగంలో మరిన్ని ప్రయోగాలు జరగాలని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ డ్రోన్ మహోత్సవ్ కార్యక్రమంలో దిల్లీలో వ్యాఖ్యానించారు. దేశం, ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నానని అన్నారు. నిపుణులకు కూడా విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ, డ్రోన్‌లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త డ్రోన్ స్టార్టప్‌లు రావాలని అందుకు అనుగుణంగా యువత ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ల్యాండ్ మ్యాపింగ్ కోసం అనేక ప్రభుత్వ పథకాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నట్లు ప్రధాని వివరించారు. డ్రోన్ల సహాయంతో 65 లక్షల ప్రాపర్టీ కార్డులను రూపొందించి ఆస్తి ఉన్నవారికి పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో, రక్షణ నుంచి విపత్తు నిర్వహణ వరకు, వ్యవసాయం నుంచి క్రీడల వరకు అన్ని రంగాలలో డ్రోన్లు వర్తిస్తాయని మోదీ ఆకాంక్షించారు.