7th Pay Commission: ఇటీవల రైల్వే ఉద్యోగులకు పండుగ బోనస్ ప్రకటించిన కేంద్ర సర్కార్.. 78 రోజుల వేతనాన్ని బోనస్ కింద అందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తంగా 11.56 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఇదే తరహాలో రైల్వే ఉద్యోగులకు మరో అదిరిపోయే శుభవార్త అందించింది కేంద్రం. ఈ పండుగ సీజన్‌లో అనేక మంది రైల్వే ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఇలా ప్రమోషన్లు పొందిన వారికి ప్రతినెలా రూ. 15 వేల చొప్పున జీతం పెరగనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. భారతీయ రైల్వేకు చెందిన కొంత మంది అధికారులు 7 వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పదోన్నతి లభిస్తుంది. ఈ పదోన్నతితో వారి బేసిక్ పే రూ. 25,350 నుంచి రూ. 29,500 లకు చేరనుంది.
రైల్వే బోర్డ్ సెక్రటేరియట్ సర్వీస్ (RBSS), రైల్వే బోర్డ్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (RBSSS) అధికారులకు పదోన్నతి లభించనుంది. ఈ అధికారులు అండర్ సెక్రటరీ, డిప్యూటీగా పదోన్నతి పొందనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న అధికారులు డైరెక్టర్ కార్యదర్శి, జాయింట్ డైరెక్టర్,సీనియర్ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకు ప్రమోషన్ పొందనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత పదోన్నతి ఉత్తర్వులు వస్తాయి. ఈ పండుగ సీజన్‌లో అనేక మంది రైల్వే ఉద్యోగులు పదోన్నతి పొందనున్నారని, దీంతో వారి ప్రతినెల జీతం దాదాపు రూ .15 వేల జీతం పెరగనుందని, వారి గరిష్ట బేసిక్ పే నెలకు రూ. 67,700 నుంచి నెలకు రూ .78,800 వరకు చేరుతుందని తెలుస్తోంది. దీనితో పాటు, డియర్‌నెస్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లలో కూడా పెరుగుదల ఉంటుందని సమాచారం. 7వ వేతన సంఘం ప్రకారం పెరిగిన జీతం పే బ్యాండ్ III కిందకు వస్తుంది.