Future-Reliance Deal: దేశీయ రిటైల్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్‌ను ప్రముఖ వ్యాపార దిగ్గజం రియలన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన పలు వ్యాపారాలను రిలయన్స్ సుమారు రూ.24 వేల కోట్లకు కొనుగోలుచేసేందుకు గతంలో డీల్ కుదిరింది. దీంతో భారతదేశంలో ఆన్‌లైన్ రిటైల్ రంగంలో దూసుకెళుతోన్న ఆమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు చెక్ పెట్టాలనేది ముకేష్ అంబానీ వ్యూహం.
అయితే ఈ సమయంలోనే ఫ్యూచర్ గ్రూప్స్‌లో 49 శాతం ఉన్న అమేజాన్ ఈ డీల్‌ను తప్పుబడుతూ తరచూ కోర్టుకు వెళ్తోంది. తమ మధ్య కుదిరిన ఒప్పందాలను ఈ డీల్ ఉల్లంఘిస్తోందని అమెజాన్ వాదిస్తోంది. దీంతో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొని ఉంది. ఒక వేళ రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్‌ల మధ్య డీల్ కుదరకపోతే దేశవ్యాప్తంగా ఏకంగా 11 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడర్స్ అసోసియేషన్, ఢిల్లీకి చెందిన ఎన్జీవో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ డీల్‌తో బిగ్ బజార్, ఈజీడే, నీల్‌గిరీస్, సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీలాంటి సంస్థలు ముడిపడి ఉన్నాయని, అందులో పనిచేసే ఉద్యోగులకు ఫ్యూచర్ గ్రూప్, రిలయెన్స్ భరోసా ఇస్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య డీల్ సరికాదంటూ అమెజాన్ తరచూ కోర్టుకు వెళ్తోంది. ఇక ఇదిలా ఉంటే ఫ్యూచర్ గ్రూప్‌నకు దేశంలోని 450 నగరాలు, పట్టణాల్లో మొత్తం 2 వేల స్టోర్లు ఉన్నాయి.