
టైర్-3 కాలేజీలో చదువు.. ఒక దశలో ఏకంగా 11 అకడమిక్ బ్యాక్‌లాగ్స్.. ప్రారంభంలో నెలకు కేవలం రూ.8,000 జీతం. కానీ హార్డ్ వర్క్, టెక్నికల్ స్కిల్స్‌పై దృష్టి, సరైన సమయంలో ఉద్యోగ మార్పులు చేసుకుంటూ ఓ ఇంజనీర్ తన కెరీర్‌లో అద్భుతమైన ఎదుగుదలను సాధించాడు. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఓ కంపెనీలో సీనియర్ ఇంజనీర్‌గా సుమారు రూ.50 లక్షల ప్యాకేజీ అందుకుంటున్న ఈ యువ ఇంజనీర్ కెరీర్ ప్రయాణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
రెడ్డిట్‌లో పంచుకున్న తన కెరీర్ అనుభవం ప్రకారం.. ఇంజనీర్ తన చివరి సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 11 బ్యాక్‌లాగ్స్‌ను ఎదుర్కొన్నాడు. చివరి సెమిస్టర్‌లో ఆరింటిని క్లియర్ చేశాడు. మిగిలిన ఐదు బ్యాక్‌లాగ్స్‌ను ఉద్యోగం చేస్తూనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరకు గ్రాడ్యుయేషన్ తర్వాత కేవలం ఆరు నెలల్లోనే వాటినీ క్లియర్ చేశాడు. 2022లో తన డిగ్రీని పూర్తి చేసుకున్నాడు.
డిగ్రీ పూర్తయ్యాక లక్నోలోని ఓ చిన్న స్టార్టప్‌లో ఎంబెడెడ్ డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించాడు. నెలకు కేవలం రూ.8,000 జీతమే వచ్చినప్పటికీ, జీతం కంటే అనుభవం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పరిశ్రమలోకి అడుగుపెట్టడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపాడు. ఆ కంపెనీలో 11 నెలల పాటు పనిచేస్తూ ఎంబెడెడ్ సిస్టమ్స్, డివైస్ డ్రైవర్లు, యోక్టో, కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్‌మెంట్, డివైస్ ఫ్లాషింగ్ వంటి టెక్నాలజీలపై అనుభవం సంపాదించాడు.
తర్వాత హైదరాబాద్‌లో ఏడాదికి సుమారు రూ.6 లక్షల జీతంతో మరో ఉద్యోగంలో చేరాడు. అయితే తనకు ఆసక్తి ఉన్న ఎంబెడెడ్ సిస్టమ్స్, లైనక్స్‌కు బదులుగా పని సైబర్ సెక్యూరిటీ వైపు ఎక్కువగా ఉండటంతో మరో అవకాశాన్ని వెతుక్కున్నాడు. అనంతరం బెంగళూరులోని ఓ అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలో టీవీ, గేమింగ్ కన్సోల్ విభాగంలో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడ సుమారు రూ.8 లక్షల వార్షిక ప్యాకేజీతో చేరాడు.
ఆ సంస్థలో సుమారు మూడున్నర సంవత్సరాలు పనిచేస్తూ తన టెక్నికల్ నైపుణ్యాలను పెంచుకున్నాడు. అనుభవంతో పాటు బాధ్యతలు పెరగడంతో అతని వార్షిక జీతం సుమారు రూ.12 లక్షలకు చేరింది. ఈ దశలో కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం, తనకు ఉపయోగపడే టెక్నాలజీలపై పట్టు సాధించడం కొనసాగించాడు. తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఓ భారతీయ బహుళజాతి కంపెనీలో చేరాడు. అక్కడ కొరియన్ ఆటోమోటివ్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్‌లో పనిచేశాడు. అయితే కేవలం నాలుగు నెలల తర్వాతే తనకు అవసరమైన సాంకేతిక అభివృద్ధి, నేర్చుకునే అవకాశాలు లేవని భావించి మరోసారి ఉద్యోగం మార్చాలని నిర్ణయించుకున్నాడు.
వరుసగా అనుభవం, టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్ ఎక్స్‌పోజర్ పెంచుకుంటూ చివరకు అమెరికాకు చెందిన ఓ కంపెనీలో సీనియర్ ఇంజనీర్‌గా సుమారు రూ.50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. కెరీర్‌లో నిరంతర అభ్యాసం, లెక్కించిన రిస్క్‌లు, పట్టుదల చాలా ముఖ్యమని అతను పేర్కొన్నాడు. మీరు ప్రారంభించిన స్థానం మీ గమ్యాన్ని నిర్ణయించదు అనే అతని మాటలు ప్రస్తుతం ఎంతోమంది యువ ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.