సభ సాగనివ్వండి, ఫిబ్రవరి 13 వరకే సమావేశాలు, రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్‌పై చర్చకు ఎక్కువ సమయం : ఉపరాష్ట్రపతి

|

Feb 01, 2021 | 4:27 AM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభను అర్ధవంతంగా, సజావుగా పని చేసేలా చూడాలని సభలోని వివిధ పార్టీల నాయకులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు...

సభ సాగనివ్వండి, ఫిబ్రవరి 13 వరకే సమావేశాలు, రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్‌పై చర్చకు ఎక్కువ సమయం : ఉపరాష్ట్రపతి
Follow us on

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభను అర్ధవంతంగా, సజావుగా పని చేసేలా చూడాలని సభలోని వివిధ పార్టీల నాయకులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. వారి సూచనపై స్పందించిన అన్ని పార్టీల నేతలు సభలో జరిగే అన్ని చర్చల్లో సమర్థవంతంగా పాల్గొంటామని, సజావుగా సాగేందుకు సహకరిస్తామని తెలియజేశారు. న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఆదివారం వివిధ పార్టీల నాయకులతో రాజ్యసభ చైర్మన్ హోదాలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశంలో మంత్రులు సహా 30 మంది వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15 వరకూ జరగాల్సి ఉండగా, సభ్యుల అభ్యర్థన మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లను పరిశీలించేందుకు వీలుగా ఫిబ్రవరి 13నాడు సమావేశాన్ని కొనసాగించి, ఆరోజు నుంచే నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయించారు. ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు బడ్జెట్ మీద చర్చకు మరింత సమయం కావాలని వివిధ పార్టీల నాయకులు కోరగా, ఇందు కోసం తగిన ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ రెండు అంశాలకు సంబంధించిన చర్చలు, సభ్యులు ముఖ్యమైన అంశాలపై మరింత చర్చించేందుకు ప్రయోజనకరంగా ఉంటాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మరింత సమయం కేటాయించాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు.

సభలో సమయ పాలన గురించి ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మంత్రులు బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి మరియు సమాధానం ఇవ్వడానికి క్లుప్తంగా మాట్లాడే నేర్పును అందిపుచ్చుకోవాలని, తద్వారా సభ్యులకు మాట్లాడేందుకు మరింత సమయం లభిస్తుందని సూచించారు. సభలోని ఇతర చిన్న పార్టీల సభ్యులకు సమయం కేటాయించే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఈ విషయం పై స్పందించిన ఛైర్మన్, వారి అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు తగిన సమయం ఇవ్వడానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి 20 పార్టీలకు చెందిన సభ్యులు ప్రతి అంశం మీద మాట్లాడ్డం అన్నివేళలా బహుశా సాధ్యం కాకపోవచ్చని, అందుకే తమకు ఆసక్తి కలిగిన అంశాలను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాలని తెలిపారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సభా నాయకుడు థావర్ చంద్ గెహ్లాట్, ఉపసభాపతి హరివంశ్, ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన ఆనంద్ శర్మ, జైరామ్ రమేష్, భూపిందర్ యాదవ్, హెచ్.డి.దేవేగౌడ, పసన్న ఆచార్య, తిరుచ్చి శివ, రాంగోపాల్ యాదవ్, డా. ఎ.నవనీత్ కృష్ణన్, ఆర్.సి.పి. సింగ్, డా. కె.కేశవరావు, వి.విజయసాయి రెడ్డి, పి.సి.గుప్తా, సంజయ్ సింగ్, ఎలమారమ్ కరీమ్, కనకమేడల రవీంద్ర కుమార్ సహా ఆర్థిక, విదేశాంగ, రైల్వే, గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.