విజయశాంతి.. ఏ మాత్రం పరిచయం అక్కర లేని పేరు. సినీ రంగంలో హీరోలను డామినేట్ చేసేంతటి కెపాసిటీ సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ ఇపుడు కాంగ్రెస్, బిజెపిల ప్లాంక్ కార్డుగా మారారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వీనర్ గా వ్యవహరించిన విజయశాంతి.. జనరల్ ఎన్నికల తర్వాత సైలెంటయ్యారు. దొరికిన ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటూ 13 ఏళ్ళ తర్వాత మొహానికి మేకప్ వేసుకుని, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరు.. మూవీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో నటిస్తూనే.. పొలిటికల్ సెటైర్లు విసురుతున్నారు విజయశాంతి. తాజాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన లేడీ అమితాబ్.. రాజకీయంగా తాను యాక్టివ్ గానే వున్నట్లు చాటుకున్నారు. అయితే.. విజయశాంతి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పకపోవడంతో పలు పార్టీలు విజయశాంతిని తమ తదుపరి ఎన్నికల ప్లాంక్ కార్డులా వాడుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి ప్రచార కన్వీనర్ గా వ్యవహరించిన విజయశాంతి.. గత నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యధాశక్తి ప్రచారం నిర్వహించారు. అయితే ఆనాటి ఎన్నికల్లోను, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లోను తెలంగాణ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేక చతికిలా పడింది. ఆ తర్వాత దాదాపు సైలెంటై పోయిన విజయశాంతి త్వరలో బిజెపిలో చేరుతున్నారని కమలనాథులు… లేదు తమ పార్టీలోనే వుంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంలో బిజెపిలో కొనసాగిన విజయశాంతి.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కొంత కాలం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. కెసీఆర్ తనకు తగిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ టిఆర్ఎస్ ను వీడిన రాములమ్మ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. రాష్ట్రం ఇచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
అయితే తాజాగా.. విజయశాంతిని బిజెపిలోకి చేర్చుకునేందుకు కమల దళం ప్రయత్నిస్తోంది. ఇటీవల మాజీ గవర్నర్ గా మారి.. రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ గా మారిన సి.హెచ్. విద్యాసాగర్ రావు విజయశాంతిని పార్టీలోకి రప్పించేందుకు యథాశక్తి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె కూడా సానుకూలంగానే వున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదని భావిస్తున్న విజయశాంతి బిజెపిలో చేరడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. తాను నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మోదీ లేదా అమిత్ షా సమక్షంలో విజయశాంతి కమలం పార్టీలో చేరతారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్.. ఇటు బిజెపి విజయశాంతిని వచ్చే ఎన్నికల్లో తమకు ప్లాంక్ కార్డుగానే భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయశాంతి తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.