హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పోలీస్ కమిషనర్‌పై మండిపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా సీపీ తయారయ్యారని ఆరోపించారు ఉత్తమ్.
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో రెండు ర్యాలీలు నిర్వహించాలని టీపీసీసీ భావించింది. డిసెంబర్ 27న సేవ్ కాన్స్టిట్యూషన్ పేరిట ర్యాలీకి ప్లాన్ చేసి పోలీసుల అనుమతి కోరారు కాంగ్రెస్ నేతలు. అయితే శాంతి భద్రతలకు, ప్రజా రవాణాకు ఇబ్బంది అంటూ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అనుమతి నిరాకరించారు. దాంతో తిరంగా యాత్ర పేరిట డిసెంబర్ 28న భారీ ధర్నాకు వెంటనే పిలుపునిచ్చింది టీపీసీసీ. దానికి కూడా అనుమతి నిరాకరించడంతోపాటు.. ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న సుమారు వేయి మంది కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు.
పోలీసుల చర్య తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. దాంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ నగర్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై తీవ్రస్థాయి పదజాలంతో విరుచుకుపడ్డారు. గాంధేయమార్గంలో ర్యాలీ చేస్తామంటే అడ్డుకున్నారని, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ దిగజారి ప్రవర్తిస్తున్నారంటూ నిందించారు. అంజనీకుమార్ చిట్టా తీసి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంజనీ కుమార్ ఆర్ఎస్ఎస్, కేసీఆర్‌లకు తొత్తుగా మారాడని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీని అవమాన పరిచేలా ప్రవర్తించాడంటూ అంజనీకుమార్‌పై మండిపడ్డారు. రోడ్లు ఖాలీ చేయించి మరీ ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతించారని, ఎంఐఎం సభకూ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీకి మాత్రం అనుమతి నిరాకరించారని వివరించారు ఉత్తమ్. ‘‘అంజనీ కుమార్.. నీ సంగతి చూస్తాం.. ఉద్యోగం చేసుకోవడానికి వచ్చావ్.. నీ ఉద్యోగం నువ్వు చేసుకుని పో‘‘ అంటూ హెచ్చరించారు. ఓవర్ యాక్షన్ చేసే పోలీసుల అంతు చూస్తామని అన్నారాయన.