Trump Taj Mahal : అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ నిన్న(సోమవారం) తాజ్‌మహల్‌ను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్‌కు దాదాపు 30 ఏళ్ల కింద ఓన్‌గా ఓ తాజ్‌మహల్ ఉండేదంటే మీరు నమ్ముతారా..?. అవును ఇది నిజం..కాని ఆ తాజ్‌మహల్ ప్రేమకి చిహ్నంగానో, ప్రేయసి కోసమో కట్టించింది కాదు. వ్యాపారం చేయడానికి, ధనికులు గేమ్స్ ఆడేందుకు కట్టించిన క్యాసినో. అమెరికాలోని న్యూజెర్సీ అట్లాంటిక్ సిటీలో 1990లోనే ట్రంప్ కట్టించిన ఆ తాజ్‌మహల్.. గోపురాలు, మినార్లు.. మిరిమిట్లు గొలిపే లైట్లతో ఎంతో గొప్పగా ఉండేది. దానికి తాజ్‌మహల్ అని పేరు పెట్టి.. ట్రంప్ ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ కంపెనీ పేరుమీద లాంచ్ చేశారు. ఈ క్యాసినో ప్రారంభోత్సవ వేడుకలో పాప్‌స్టార్ మైకల్ జాక్సన్ తన ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్ ‘తాజ్‌మహల్’లో మొత్తం 3009 స్లాట్ మిషన్లు, 167 గ్యాంబ్లింగ్ టేబుల్స్ ఉండేవి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో పనిచేసేవారు భారతీయ వస్త్రదారణతో ఉండేవారు.
అయితే దీన్ని ట్రంప్ ఎక్కువకాలం నిర్వహించలేకపోయారు. రుణ సంబంధమైన వ్యవహారాలు చుట్టుముట్టాయి. అమెరికా ప్రభుత్వం 1998లో ఈ క్యాసినో నిర్వహణ విషయమై ట్రంప్‌పై రూ. 342 కోట్ల జరిమానా విధించింది. ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదయ్యింది. ఇక 2016లో ట్రంప్ ‘తాజ్‌మహల్’ వేలానికి వెళ్లి, విక్రయమయ్యింది.